తెలంగాణలో లాక్ డౌన్ తప్పదా.? రెండ్రోజుల్లో ఏం జరగబోతోంది.?

‘తెలంగాణ లో లాక్ డౌన్ విధిస్తారా.? లేదంటే, నైట్ కర్ఫ్యూ విధిస్తారా.? వారాంతాల్లో లాక్ డౌన్ విషయంలో మీ వద్ద ప్రణాళికలు ఏమైనా వున్నాయా.? వుంటే, 48 గంటల్లో చెప్పండి. మీరు నిర్ణయం తీసుకోకపోతే, మేం ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది..‘ అంటూ తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించిందంటే తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి వాస్తవ స్థితి ఏంటి.? అన్నదానిపై అనుమానాలు కలగక మానవు.

కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగించే రెమిడిసివిర్ ఔషధం కోసం, ఏకంగా ఔషధాన్ని మార్కెటింగ్ చేసే సంస్థ కార్యాలయం వద్ద వందలాది మంది ఈ రోజు గుమికూడారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారు ఝామున ఐదు గంటలకే క్యూ లైన్లలో నిల్చున్నారు. ఇది తెలంగాణలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వైనాన్ని చెప్పకనే చెబుతోంది.

‘అసలు ఆ స్థాయిలో రెమిడిసివిర్ కొరత లేదు. కొందరు వైద్యులు అవసరం వున్నా లేకపోయినా ఆ ఔషధం కోసం ఒత్తిడి తీసుకొస్తుండడం వల్లే ఈ పరిస్థితి. ఆరు డోసుల వ్యాక్సిన్ తెప్పించి, అందులో ఒక డోస్ వాడేసి, మిగతాది కొన్ని ఆసుపత్రులు దోచేస్తున్నాయి..’ అంటూ నిపుణులు కొందరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.

దేశంలో మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ అత్యంత తీవ్రంగా వుంది. ఆ స్థాయి తీవ్రత తెలంగాణలో లేదు, తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న అధికారిక గణాంకాల ప్రకారం. కానీ, అనధికారికంగా పరిస్థితి అత్యంత తీవ్రంగా వుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైకోర్టు, లాక్ డౌన్ వంటి అంశాల గురించి తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయడం చూస్తే, అనుమానాలు మరింత పెరగకమానవు. లక్షకు పైగా టెస్టులు చేస్తూ, 5 వేలకు అటూ ఇటూగా కేసులు నమోదవుతుంటే.. పరిస్థితి తీవ్రంగా వుందని ఎలా అనుకోగలం.? కానీ, తీవ్రంగానే వుంది.

కేసీఆర్ కరోనా బారిన పడ్డారు.. మరికొందరు రాజకీయ ప్రముఖులూ కరోనాకి చిక్కారు. సో, ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తమవడంతోపాటు, ప్రజలూ తమ బాధ్యతను గుర్తెరగాల్సిందే. లేకపోతే లాక్ డౌన్ తప్పదేమో. కోర్టు, 48 గంటల తర్వాత ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుందో, ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.


Recent Random Post: