నేను బ్రతికి ఉన్నంత వరకు శ్రీదేవి బ‌యోపిక్‌కి అనుమ‌తించ‌ను!

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి బ‌యోపిక్ తెర‌కెక్కేందుకు అవ‌కాశం ఉందా? ఇదే ప్ర‌శ్న ఎదురైంది బోనీక‌పూర్ కి. దానికి ఆయ‌న స‌మాధానం ఏంటో తెలుసా?

బోనీ కపూర్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం – మైదాన్ విడుదల ఏర్పాట్ల‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం హ‌డావుడిగా తిరిగేస్తున్నాడు. ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో అత‌డి దివంగత భార్య శ్రీదేవి జీవిత‌క‌థ‌ ఆధారంగా బయోపిక్ తెర‌కెక్కే అవకాశం ఉందా? అని మీడియా త‌న‌ను ప్ర‌శ్నించింది. ఈ బయోపిక్ తీసే ఉద్దేశం తనకు లేదని, ఎవరినీ అనుమతించబోనని కూడా బోనీ క‌పూర్ త‌డుముకోకుండా స‌మాధాన‌మిచ్చారు.

శ్రీ‌దేవిపై త‌న‌కు ఉన్న‌ గౌరవం కార‌ణంగా బ‌యోపిక్ చేయ‌న‌ని బోనీ అన్నారు. శ్రీ‌దేవి చాలా ప్రైవేట్ వ్యక్తి.. త‌న‌ జీవితం ప్రైవేట్‌గా ఉండాలి… నేను జీవించి ఉన్నంత‌ వరకు ఇది జరగడానికి నేను అనుమతించను అని అన్నారు. భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్‌గా శ్రీదేవి కీర్తినందుకున్నారు. త‌న‌దైన అద్భుత న‌ట‌న‌, అభిన‌యంతో ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ద‌శాబ్ధాల పాటు న‌టిగా శ్రీ‌దేవి అల‌రించారు.

దక్షిణ భారత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీ‌ద‌వి అక్కడి నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి బహుముఖ పాత్రలతో ప్రేక్షకులను అలరించింది. నాలుగు దశాబ్దాల కెరీర్ లో 300 పైగా చిత్రాలకు పనిచేశారు. తెలుగు-త‌మిళం-హిందీలో అగ్ర నాయిక హోదాను కీర్తిని అందుకున్నారు. 2018 లో శ్రీ‌దేవి అకాల మరణం అభిమానుల‌కు షాకిచ్చింది.

ఇంగ్లీష్ వింగ్లీష్ శ్రీ‌దేవి న‌టించిన చివరి బాలీవుడ్ చిత్రం. శశి గాడ్‌బోలే పాత్రకు ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. తాను జీవించి ఉన్నంత వరకు శ్రీదేవి బయోపిక్‌ రాదని బోనీ కపూర్‌ గట్టి సమాధానం ఇవ్వ‌డాన్ని బ‌ట్టి ఇప్ప‌ట్లో ఈ బ‌యోపిక్ చూసే అవ‌కాశం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. 1996లో శ్రీదేవిని బోనీక‌పూర్ వివాహం చేసుకున్నాడు. శ్రీ‌దేవి 2018లో మరణించారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జాన్వీ కపూర్ – ఖుషీ కపూర్ క‌థానాయిక‌లుగా సుప‌రిచితులు.


Recent Random Post: