అమ్మకానికి సంప్రదాయ భోజనం, టీటీడీ రివర్స్ గేర్.!

చీవాట్లు ఎదురయ్యాక టీటీడీ వెనక్కి తగ్గక తప్పలేదు. ‘టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. సంప్రదాయ భోజనాన్ని ఎంత ఖర్చుతో తయారవుతోందో అంతే ధరకు విక్రయిస్తాం. ఇందులో లాభాపేక్ష ఏమీ లేదు..’ అంటూ టీటీడీ బీభత్సమైన వివరణ ఇచ్చుకున్నా, పవిత్ర తిరుమల కొండ మీద.. వెంకటేశ్వరస్వామి సన్నిధిలో.. ఉచితంగా భక్తుల కడుపు నింపాల్సిన టీటీడీ, భోజనాన్ని కూడా అమ్ముకోవడమా.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు.

తీవ్రస్థాయిలో ప్రజల నుంచి వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చుకోక తప్పలేదు. పాలకమండలి లేని సమయంలో తీసుకున్న నిర్ణయంగా సంప్రదాయ భోజన అమ్మకం పథకాన్ని అభివర్ణించారు. దాన్ని వెంటనే నిలిపివేస్తున్నట్లూ ప్రకటించేశారు వైవీ సుబ్బారెడ్డి.

వెంకటేశ్వరస్వామి సన్నిధిలో అన్నం ప్రసాదంతో సమానమనీ, దాన్ని విక్రయించడం సబబు కాదనీ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయ పడ్డారు. అంతా బాగానే వుందిగానీ, లడ్డూ ప్రసాద విక్రయం సంగతేంటి.? లడ్డూ ధరని ఇప్పటికే పెంచేసి.. భక్తుల మీద భారం మోపుతోంది టీటీడీ. అదొక్కటేనా, ఇతర ప్రసాదాలదీ అదే తీరు. పైగా, ఎన్నికల వేళ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాలు.. ఓటర్లను ప్రలోభ పెట్టడానికీ ఉపయోగపడుతున్న వైనం మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో చూసేశాం.

ఏదిఏమైనా, టీటీడీ అంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమలను అత్యంత పవిత్రంగా వుంచేందుకోసం పనిచేయాల్సిన సంస్థ. రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా మారిపోయిన టీటీడీ నుంచి అంత గొప్ప బాధ్యతను ఆశించలేం.. అన్న వాదన ఈనాటిది కాదు.. ఎప్పటినుంచో వినిపిస్తున్నదే.

అయితే, ఇటీవలి కాలంలో తరచూట టీటీడీ వివాదాల్లోకెక్కుతోంది. సంప్రదాయ భోజనం పేరుతో టీటీడీ చేయబోయిన ప్రయోగం అయితే అత్యంత ఆక్షేపణీయం. ఓ వైపు ఉచిత దర్శనాలు నిలిపేసి, ఇంకో వైపు.. ఇలా అన్న ప్రసాదాన్ని కూడా వేరే పేరుతో అమ్మకానికి పెట్టే ఆలోచన చేయడమంటే, హిందూ ధర్మంపై ఇంతకన్నా దాడి ఇంకేముంటుందన్నది వెంకన్న భక్తుల ప్రశ్న.


Recent Random Post: