ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ఎందుకు రద్దయ్యింది చెప్మా.?

దారుణం, దుర్మార్గం, ఘోర అవమానం.. రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్రం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడమా.? కేంద్రం వద్ద రాష్ట్రం మోకరిల్లాలన్నంత అహంకారం కేంద్రం ప్రదర్శించడమా.? ఇలాంటి చాలా మాటలు చంద్రబాబు హయాంలో విన్నాం.. 2014 నుంచి 2018 వరకు టీడీపీ – బీజేపీ కలిసి పనిచేశాయి. రాష్ట్రంలో, కేంద్రంలో రెండు పార్టీలూ అధికారం పంచుకున్నాయి. 2018లో ఆ బంధం తెగింది, కేంద్రం.. రాష్ట్రాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. చంద్రబాబుకి ఢిల్లీ అపాయింట్‌మెంట్ దొరకడం గగనమైపోయింది. దాంతో, ఏపీలో వైసీపీ అనుకూల మీడియా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టీడీపీ అనుకూల మీడియా తక్కువేం తిన్లేదు.. వెరసి, నానా యాగీ జరిగింది. ఇప్పుడేం జరుగుతోంది.? ఇప్పుడూ అదే పరిస్థితి.

ముఖ్యమంత్రి మారారు.. చంద్రబాబు స్థానంలోకి వైఎస్ జగన్ వచ్చారు. సేమ్ ట్రీట్‌మెంట్ ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎదురవుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఢిల్లీ యాత్రని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. రద్దు కాదిది, వాయిదా.. అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలకమైన చాలా అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళాలనుకున్నారన్నది ప్రభుత్వ వాదన. కాదు కాదు, తన మీద కేసుల వ్యవహారమై ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడాలని జగన్ అనుకుంటున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగేదేశం పార్టీ విమర్శిస్తోంది. వీటిల్లో ఏది నిజం.? అన్నది వేరే చర్చ.

కేంద్ర ప్రభుత్వ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం మాత్రం ఆక్షేపణీయమే. వ్యాక్సినేషన్ సహా చాలా సమస్యలున్నాయి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కేవలం కరోనాకి సంబంధించి. పోలవరం ప్రాజెక్టు సహా పాత అంశాలు అదనం. ఈ అంశాలపై చర్చించాలని ముఖ్యమంత్రి అనుకుంటోంటే, కేంద్ర ప్రభుత్వ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడమేంటి.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. అప్పుడు చంద్రబాబు మీద వైసీపీ ఎగిరింది.. ఇప్పుడు వైసీపీ మీద టీడీపీ ఎగురుతోంది. పెద్దగా తేడా లేదు.. ఇద్దరికీ సమస్థాయిలో అవమానం కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ చేస్తోంది. కానీ, ఈ అవమానం ఆయా పార్టీలకో, ఆయా వ్యక్తులకో, ముఖ్యమంత్రులకో మాత్రమే కాదు.. రాష్ట్రానికి. ఇది అత్యంత బాధాకరమైన విషయం.


Recent Random Post: