ఢిల్లీకి సీఎం జగన్.. ఏపీలో మతమార్పిడులపై బీజేపీ ‘సోషల్’ గుస్సా.!

ఆంధ్రపదేశ్‌ లో మత మార్పిడుల అంశం మరోమారు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికార వైసీపీ, రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడుల్ని ప్రోత్సహిస్తోందన్నది భారతీయ జనతా పార్టీ ఆరోపణ.

తాజాగా గుంటూరు జిల్లాలోని ఎడ్లపాడులో అక్రమంగా ‘క్రిస్టియన్ మాఫియా’ నిర్మాణాల్ని చేపడుతోందంటూ బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరైన సునీల్ దేవ్‌ధర్ సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని కూడా ఆయన పోస్ట్ చేశారు. ఆ ప్రాంతంలో సీతాదేవి పాద ముద్రలున్నాయనీ, నరసింహస్వామి దేవాలయం వుందనీ సునీల్ దేవ్‌ధర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘ఎన్‌క్రోచ్‌మెంట్4క్రిస్ట్ఇన్ఎపి’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పలువురు బీజేపీ ముఖ్య నేతలు ట్వీట్లేస్తున్నారు. ఇలా ట్వీట్లేస్తున్నవారిలో రాష్ట్ర బీజేపీ నేతలే కాక, బీజేపీ జాతీయ స్థాయి నేతలూ పలువురు వున్నారు.

మరోపక్క, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు ఢిల్లీకి వెళుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి, అమిత్ షా ఆంధ్రపదేశ్‌లో పర్యటించాల్సి వుంది. అధికారిక కార్యక్రమాలతో పాటు, పార్టీ పరమైన కార్యక్రమాలకు సంబంధించి కీలక ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే, అనూహ్యంగా అమిత్ షా ఢిల్లీ పర్యటన రద్దయ్యింది.

అమిత్ షా తిరుపతి పర్యటనలో అధికారికంగా ముఖ్యమంత్రి జగన్ కూడా ఓ కార్యక్రమానికి హాజరవ్వాల్సి వుంది. అయితే, అమిత్ షా తిరుపతి పర్యటన రద్దవడంతో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర హోంమంత్రితో చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది.

సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడుల అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు, బీజేపీ జాతీయ స్థాయి నేతలు వరుస ట్వీట్లతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. జగన్ ఢిల్లీ పర్యటనకీ, రాష్ట్రంలో మత మార్పిడులపై బీజేపీ ఆందోళనకీ లింక్ ఏమైనా వుందా.? అన్నది తేలాల్సి వుంది.


Recent Random Post: