పదేళ్ల మీడియా ఎడబాటుకు కారణం చెప్పిన సూపర్ స్టార్

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న బీస్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆశ్చర్యంగా విజయ్ కనిపించాడు. గత పది పన్నెండు సంవత్సరాలుగా విజయ్ ని ఆయన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చూసిందే లేదు. మీడియా సమావేశం లేదా ఇంటర్వ్యూ ఇలా ఏ ఒక్క చోట కూడా ఆయన కనిపించలేదు.

విజయ్ అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకుండానే.. మీడియా సమావేశంలో పాల్గొనకుండానే సినిమాలను విడుదల చేస్తాడు. తెలుగు ప్రేక్షకులు విజయ్ ఇక్కడకు రాడని అనుకుంటారు. కాని అసలు విషయం ఏంటీ అంటే ఆయన తమిళనాడు లో కూడా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనడు. ఆయన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనక పోవడం వెనుక పెద్ద కారణం ఉందని ఇప్పటి వరకు తెలియదు.

బీస్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో విజయ్ పాల్గొంటున్నాడు. ఆ సమయంలోనే గడచిన పది పదకొండు సంవత్సరాలుగా మీడియా ముందుకు రాకపోవడంకు కారణం ఉందని చెప్పుకొచ్చాడు. తాను పదేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అయితే తదుపరి రోజు నేను మాట్లాడింది కాకుండా మరో విషయం.. అస్సలు నా ఉద్దేశ్యం కానిది పేపర్ లో వచ్చింది. ఆ వార్త చూసి నేను ఆశ్చర్యపోయాను అన్నాడు.

నేను చేయని వ్యాఖ్యలు.. నేను మాట్లాడని మాటలను చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ఆ వ్యాఖ్యల గురించి నా కుటుంబ సభ్యులకు వివరణ ఇచ్చుకున్నాను. కాని జనాలకు మాత్రం వివరణ ఇవ్వాలనుకోలేదు. అప్పటి నుండి నేను ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. ఒక వేళ వచ్చినా కూడా నిజాలు కాకుండా అబద్దాలు మీడియాలో చూపిస్తారనే ఉద్దేశ్యంతోనే తాను ఇంటర్వ్యూలకు మరియు మీడియాకు దూరంగా ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఆ వార్త కథనం ఏంటీ.. ఎవరు అలా రాశారు.. ఏ విషయంలో విజయ్ బాధ పడ్డాడు అనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు. కాని ఆ సమయంలో విజయ్ చాలా బాధ పడ్డట్లుగా మాత్రం తెలుస్తుంది. పదేళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న విజయ్ ఎట్టకేలకు అయినా మీడియా ముందుకు రావడం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుండి కంటిన్యూ గా విజయ్ మీడియాలో కనిపించబోతున్నాడని అభిమానులు ఆనందంగా ఉన్నారు.

బీస్ట్ సినిమా విడుదల నేపథ్యంలో నెల్సన్ దిలీప్ మరియు హీరోయిన్ పూజా హెగ్డే లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మీడియాలో వారిద్దరితో పాటు ఇప్పుడు విజయ్ కూడా జత చేరడం తో సినిమా ప్రమోషన్స్ పీక్స్ కు చేరాయి అంటూ అభిమానులు ఆనందంగా ఉన్నారు. సినిమా వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదు కాబోతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: