విలన్ గా మహేశ్ తో తలపడటానికి సిద్ధమే: సుధీర్ బాబు

కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఆరంభంలో అవకాశం ఉంది గనుక ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడని అంతా అనుకున్నారు. కానీ తనని తాను హీరోగా మార్చుకోవడానికీ .. మలచుకోవడానికి ఆయన చేస్తున్న కసరత్తును చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. పాత్రకి తగినట్టుగా తన లుక్ లో మార్పు తీసుకురావడానికీ తన పాత్రకి న్యాయం చేయడానికి ఆయన ఎంతగా తహతహలాడుతున్నది గమనించారు. చకచకా చాలా సినిమాలు చేసేయాలనే ఆరాటం చూపించకుండా తనకి నచ్చిన కథలను మాత్రమే చేసుకుంటూ వెళుతున్నాడు.

ఇక చాలామంది హీరోలు ఒక సినిమా వరకూ సిక్స్ ప్యాక్ చేసేసి .. ఆ తరువాత మళ్లీ ఆ విషయాన్ని గురించి అంతగా పట్టించుకోరు. కానీ సుధీర్ బాబు అలా కాదు .. సల్మాన్ మాదిరి ఆయన ప్రతి సినిమాలోను సిక్స్ ప్యాక్ తోనే కనిపిస్తారు. అందుకు ఎంతగా కష్టపడాలనే విషయం చాలామందికి తెలియదు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సిద్ధమవుతోంది. ఆయన తన కెరియర్ ను మొదలుపెట్టి 10 ఏళ్లు పూర్తయింది. ఈ పదేళ్ల తన ప్రయాణాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు.

“నేను సినిమాల్లోకి వచ్చేముందు ఒకటే మాట అనుకున్నాను. ప్రతి సినిమా హిట్ కాకపోయినా ఫరవాలేదు. కానీ ఎంచుకునే కథల విషయంలో .. పాత్రలో విషయంలో గౌరవం తగ్గకుండా చూసుకోవాలని అనుకున్నాను. అదే పద్ధతిని ఇప్పటివరకూ ఫాలో అవుతూ వస్తున్నాను. అన్ని సార్లు హిట్ కొట్టడం ఎవరికీ సాధ్యం కాదు .. అలా చూసుకుంటే కొన్ని మంచి సినిమాలు చేశాననే సంతృప్తి ఉంది. కథ బాగుండగానే సరిపోదు ..

ఆ కథను చెప్పినంత బాగా తెరకెక్కించే సామర్థ్యం దర్శకుడికి ఉందా లేదా అనే విషయాన్ని గ్రహించడం కూడా చాలా అవసరం. అలాగే ఏ కథకి ఎంతవరకూ బడ్జెట్ పెట్టాలి? అనే విషయాలపై అవగాహన చాలా అవసరం.

ఒక సినిమా హిట్ కాగానే ఇక సెటిలైపోయామని అనుకోవడానికి లేదు. ప్రతి సినిమా .. మొదటి సినిమాగా చేయకపోతే ఇక్కడ నిలబడలేం. సినిమాలకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో .. ఫ్యామిలీకి కూడా అంతే ప్రాముఖ్యతను ఇవ్వాలనే విషయాన్ని కృష్ణగారు .. మహేశ్ బాబు గారు నుంచి నేర్చుకున్నాను. కృష్ణగారు .. మహేశ్ ఇద్దరూ కూడా నా సినిమాలపై తమ అభిప్రాయం చెబుతూనే ఉంటారు. అయితే నాకు ఈ ఫేవర్ చేసి పెట్టండని వాళ్లని ఎప్పుడూ అడగలేదు. నా కష్టాన్ని నమ్ముకునే ముందుకు వెళుతున్నాను. నాకు లభిస్తున్న గుర్తింపుకు కారణం కూడా అదే.

పెద్ద దర్శకుల సినిమాలలో అవకాశం వస్తే అందంగా ఉంటుంది. అలాగే కొత్త దర్శకులతో పనిచేస్తున్నప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. నా సినిమా ద్వారా పరిచయమైన దర్శకులు నన్ను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. కొత్త దర్శకులతో పనిచేయడానికి ప్రయత్నించడం మంచి అలవాట్లని కృష్ణగారు కూడా అంటూ ఉంటారు. మొదటి నుంచి కూడా యాక్షన్ సినిమాలు ఇష్టం. అలాంటి సినిమాలు చేయాలని ఉంటుంది. ఇక మహేశ్ సినిమాలో విలన్ గా చేయడానికీ .. ఆయనతో కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించడానికి సిద్ధమే .. అయితే అందుకు తగిన కథ దొరకాలి” అంటూ చెప్పుకొచ్చాడు.


Recent Random Post: