హీరోలందరితో చేశారు కానీ మా హీరోతో ఎప్పుడు?

సరిగ్గా బాహుబలి విడుదల తర్వాత సన్నివేశం ఇప్పుడు స్ఫురణకు వస్తోంది. అప్పట్లో సంచలనాల దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- అల్లు అరవింద్ బృందం గట్టిగానే ప్రయత్నించిందని కథనాలొచ్చాయి. బన్నీతో రాజమౌళి పని చేస్తారని అభిమానులు భావించారు. కానీ ఆ కాంబినేషన్ ఎందుకనో వీలు పడలేదు. చరణ్ తో మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తీసిన రాజమౌళితో సినిమా చేయాలని బన్ని కలగనని రోజు లేదు. కానీ అది ఇప్పటికీ సాధ్యపడలేదు ఎందుకనో.

రాజమౌళి మాత్రం వరుసగా తన హీరోల్ని మారుస్తూ సినిమాలు చేస్తూనే ముందుకు వెళుతున్నారు. తొలిగా ప్రభాస్ – రానాలతో బాహుబలి తీసారు. దీంతో మల్టీస్టారర్ ట్రెండ్ ని పరాకాష్టకు చేర్చి ఆ తర్వాత వెంటనే రామ్ చరణ్ – రామారావులను కలిపి ఏకంగా ఆర్.ఆర్.ఆర్ తో మరో సెన్సేషన్ కి రెడీ అయ్యారు. అంతకుముందు కూడా రవితేజ లాంటి మాస్ హీరోతో.. సునీల్ లాంటి కామెడీ హీరోతో సినిమాలు చేసిన రాజమౌళి బన్నీతో మాత్రం ముందుకు రాలేదు.

తదుపరి ఆర్.ఆర్.ఆర్ తర్వాత కూడా సూపర్ స్టార్ మహేష్ తో సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు రాజమౌళి. ఇలానే అయితే ఎలా? అందుకే బన్ని అభిమానులు జక్కన్నను పదే పదే ప్రశ్నిస్తున్నారు. అందురు హీరోలతో చేశారు సరే.. మా హీరోతో ఎప్పుడు చేస్తారు? అన్నదే వారి ప్రశ్న. ఆసక్తికరంగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్పకి ముంబైలో క్రేజ్ విపరీతంగా ఉందని.. బాలీవుడ్ లో దూకుడుగా సినిమాను ప్రమోట్ చేయాలని పుష్ప ఈవెంట్లో సూచించడం చర్చనీయాంశమైంది.

హిందీ సర్కిల్స్ లో పుష్ప ప్రమోషన్ కోసం బన్ని ముంబై వెళతాడా లేదా? అన్నది అటుంచితే.. రాజమౌళితో సినిమా ఎప్పుడూ అన్నదే శేష ప్రశ్నగా మిగిలింది. అల్లు అర్జున్ ను పరిశ్రమలో అత్యంత కష్టపడి పనిచేసే స్టార్ అని ప్రశంసించడమే కాదు తనతో ఓ సినిమా తీయాలి కదా! అని ప్రశ్నిస్తున్నారు జక్కన్నను. సాధ్యమైనంత తొందర్లోనే దీనికి ఆన్సర్ చెబుతారేమో చూడాలి. పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదలవుతుండగా మూడు వారాల గ్యాప్ తో ఆర్.ఆర్.ఆర్ విడుదలవుతోంది. సంక్రాంతి 2022 కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.


Recent Random Post: