రోగ్ వర్సెస్ క్రిమినల్: అత్యంత నీఛ స్థాయికి దిగజారిన ఏపీ రాజకీయం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు వినాలంటే ‘రోగ్’, ‘క్రిమినల్’.. వీటితోపాటు అప్పులు, కూల్చివేతలు, అరెస్టులు, దాడులు.. ఆపై మోసాలు.. ఇంతేనా.? ఇంకేమీ లేదా.?

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించకుండానే ఆయన్ని ‘రోగ్’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారన్నది ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం తాలూకు సారాంశం. ఈ వ్యవహారం తన దృష్టికి కూడా వచ్చిందని వైసీపీ ఎంపీ రఘురామ చెప్పుకొచ్చారు.

రఘురామ తగ్గుతారా.? తనను గతంలో వైసీపీ సర్కారు అరెస్టు చేసిన వ్యవహారంపై తాజాగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని ‘క్రిమినల్’ అంటూ అభివర్ణించేశారు. పైశాచిక ఆనందం అన్నారు, ఇంకోటేదో అన్నారు.. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడంటూ రఘురామ వ్యాఖ్యానించారు.

అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.? పొరుగునున్న రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో దూసుకుపోతోంది. అప్పులెందుకు చేస్తున్నారయ్యా.? అని ప్రశ్నిస్తే, ‘చంద్రబాబు హయాంలో అప్పులు చేయలేదా.? ఇప్పుడే ఎందుకీ రాద్ధాంతం.?’ అంటూ అధికారపక్షం అధికారికంగానే ఎదురుదాడికి దిగుతోంది.

రాష్ట్రంలో విపక్ష నేతల అక్రమ అరెస్టులనేవి రోజువారీ అధికారిక కార్యకలాపాలుగా మారిపోయాయి. అరెస్టులు చేయడం, కోర్టుల్లో చీవాట్లు తినడం.. ఇదే పోలీసు వ్యవస్థకు పరమ రొటీన్ వ్యవహారమైపోయిందన్న విమర్శలున్నాయి. ఎవరి గోల వారిదే.!

పోలవరం ప్రాజెక్టు అనవసరం, రాష్ట్రానికి రాజధాని అనవసరం.. అసలు రాష్ట్ర అభివృద్ధే అనవసరం.. తిట్టుకోవడం, తీవ్రమైన ఆరోపణలు చేయడం, అరెస్టులు, బెయిల్.. కోర్టుల మొట్టికాయలు.. అప్పులు, యాగీ.. అంతిమంగా అన్ని వర్గాల ప్రజలూ రోడ్లపైకి రావడం.. ఇదీ రాష్ట్రం దుస్థితి.


Recent Random Post: