రఘురామ చుట్టూ బిగుసుకుంటోన్న వైసీపీ ఉచ్చు.? నిజమెంత.!

ఏకంగా లక్ష యూరోలు.. సుమారుగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడికీ మధ్య జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోన్న విషయం విదితమే. రాజద్రోహం కేసులో రఘురామ అరెస్టయ్యాక, ఆయన్నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ద్వారా, ఈ విషయాన్ని ఏపీ సీఐడీ బయటపెట్టిందని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు ఏపీ సీఐడీ కూడా, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు ఆ మధ్య ఓ కథనం తెరపైకొచ్చింది. ఇందులో నిజానిజాలెంత.? అన్నదానిపై నిగ్గు తేల్చాల్సింది న్యాయస్థానాలే.

అయితే, బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో సహా, వైసీపీ.. తీవ్రస్థాయి ఆరోపణలు గుప్పిస్తోంది. ఓ అడుగు ముందుకేసి, ప్రధాని నరేంద్ర మోడీకీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కీ రఘురామ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. రఘురామ దేశం విడిచి పారిపోకుండా చూడాలనీ, ఆయనపై మనీ లాండరింగ్, ఫెమా చట్టాల కింద చర్యలు తీసుకోవాలనీ వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం దాకా ఎందుకు.? పక్కా ఆధారాలున్నాయని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం, రఘురామ మీద కొత్తగా కేసులు బనాయిస్తే సరిపోతుంది కదా.? అన్న డౌట్ మీకొస్తే అది మీ తప్పు కానే కాదు.

ఎలాగైనా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మీద అనర్హత వేటు వేయించాలనే ప్రయత్నంలో వుంది వైసీపీ. రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యల కంటే, వైసీపీకి రఘురామ తలనొప్పి ఎక్కువైపోయింది మరి. అయినా, ఎవరు ఎవరి మీద ఏం ఫిర్యాదులు చేస్తున్నారు.? ఆర్థిక నేరాల విషయమై కదా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నది.? అవే కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడిగా వున్నారు కదా.? మరి, అలాంటి పార్టీ నేతృత్వంలో నమోదయ్యే ఫిర్యాదుల్లో వాస్తవాలెలా వుంటాయి.? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

‘20కి పైగా అభియోగాలు మీ ఇద్దరి మీదనే వున్నాయి.. మీరు నా మీద ఆరోపణలు చేయడమేంటి.. సిగ్గులేకపోతే సరి..’ అంటూ ఇప్పటికే రఘురామ తన మీద వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. అంతేనా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ప్రధానికి ఫిర్యాదు చేశారు రఘురామ. దానికి కౌంటర్ ఎటాక్ తప్ప.. రఘురామ మీద వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలుంటాయని ఎలా అనుకోగలం.?


Recent Random Post: