నాడు జయసుధ.. నేడు ప్రకాష్ రాజ్.. సేమ్ స్టోరి!

ఒక దగ్గర ఓడిపోయిన వాళ్లు మరో చోట తమ సత్తాను చాటాలనుకోవడం సర్వ సాధారణమే. అయితే ఇక్కడో విచిత్రం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా .. ఎంపీగా పోటీపడి దారుణంగా ఓటమిని చవి చూసిన వాళ్లు తమ ఉనికిని చాటు కోవడం కోసం ఆర్టిస్టులకు చెందిన `మా` అసోసియేషన్ ఎలక్షన్ లలో అధ్యక్ష పదవికి పోటీకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. గతంలో `మా` అధ్యక్ష పదవి కోసం నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ పోటీకి దిగిన విషయం తెలిసిందే.

అదే సమయంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్తిగా తెరాస అభ్యర్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పోటీపడిన జయసుధ ఆ ఎన్నికల్లో తలసానిపై దారుణంగా ఓటమి పాలైంది. ఇక రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలంటే వెంటనే ఏదో ఒక పదవిని చేపట్టాలనే ఆలోచనతో `మా` ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీకి దిగారు. ఈ సందర్భంగా జరిగిన రచ్చ సార్వత్రిక రాజకీయాల్లో రాజకీయ నాయకుల విమర్శలని తలపించేలా చేసింది.

తను అధ్యక్ష పదవికి పోటీ చేస్తుంటే ఏ మాత్రం బాధ్యత.. అర్హత లేని ఓ కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ పోటీకి దిగడమేంటని ఆయనని జయసుధ మీడియా ముఖంగానే దారుణమైన పదజాలంతో అవమానించి వార్తల్లో నిలిచింది. పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన అధికార పార్టీ మంత్రి తలసానిని రంగంలోకి దింపడం.. రాజేంద్ర ప్రసాద్ కే ఇండస్ట్రీ వర్గాలు తలొగ్గడం తెలిసిందే. సరిగ్గా ఇది జరిగిన ఇన్నేళ్ల తరువాత మళ్లీ అలాంటి సీనే `మా` ఎన్నికల్లో రిపీట్ కావడం గమనార్హం. తాజాగా జరగనున్న `మా` అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న విషయం ఎలిసిందే. జయసుధ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తరువాతే `మా` ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీకి దిగారు. అదే తరహాలో ప్రకాష్ రాజ్ కూడా ఆ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీ స్థానానికి పోటీకి దిగారు.

కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి పోటీకి దిగి అక్కడ తన సత్తాను చాట లేక దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇప్పడు `మా` ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీకి దిగుతున్నారు. ఇది యాధృచ్చికమే అయినా మిగతా విషయాల్లో జయసుధకు ప్రకాష్ రాజ్ కు సారుప్యత లేకపోయినా ఈ ఒక్క విషయంలో మాత్రం దగ్గరి పోలికలు వుండటం గమనార్హం. అయితే అప్పట్లో జయసుధకు చిరు వర్గం అండగా నిలబడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రకాష్ రాజ్ కు చిరు వర్గంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా అండగా నిలబడింది. కారణం సీఎం కేసీఆర్ తో.. తెరాస వర్గాలతో ప్రకాష్ రాజ్ కు సన్నిహిత సంబంధాలు వుండటమే.

ఇది ప్రకాష్రాజ్ బాగా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. పైగా ప్రకాష్రాజ్ చెబుతున్న లాజిక్లకు ఇండస్ట్రీ వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అధ్యక్ష పదివికి కలెక్షన్కింగ్ మోహన్బాబు తనయుడు మంచు విష్ణు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ అడ్వకేట్ సీవీఎల్ నరసింహారావు పోటీపడుతున్నా మెజారిటీ వర్గం ప్రకాష్రాజ్కు సపోర్ట్ చేస్తుండటం గమనార్హం. కారణం ఆయన చెబుతున్న లాజిక్లు 100 మంది డాక్టర్లతో క్లబ్ ని ఏర్పాటు చేసి వారి ద్వారా ఆర్టిస్ట్ లకు వైద్య సేవలు అందించడం వంటిపలు ఆసక్తికర విషయాలు ఆయనని పోటీలో ముందు వరుసలో నిలబెట్టాయి. ఇక ప్రభుత్వ అండ మెగా ఫ్యామిలీ అండదండలు వుండటంతో ప్రకాష్రాజ్ ఎన్నిక లంఛనమే అనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ప్రకాష్రాజ్ కూడా తన గెలుపుపై ధీమాగానే వుండటం విశేషం.


Recent Random Post: