ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ.. ఏదీ లేదన్న ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ తెలుగు సినీ పరిశ్రమలో కొత్త కుంపటి పెట్టబోతున్నారన్న ప్రచారం జరిగిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ప్రకాష్ రాజ్ చాలా తేలిగ్గా స్పందించారు. సెటైరికల్ కామెంట్లు చేశారు. ఆత్మ లేదు.. పరమాత్మ లేదు.. ప్రేతాత్మ అసలే లేదు.. అనేశారు ప్రకాష్ రాజ్.

ఆల్ ఇండియా తెలుగు సినీ నటుల సంఘం.. ఆల్ తెలుగు సినీ నటుల సంఘం.. ఆంధ్రా, తెలంగాణ సినీ నటుల సంఘం.. అనే పేర్లలో ఏదో ఒక పేరుతో ‘మా’కి ధీటుగా కొత్త అసోసియేషన్ ప్రకాష్ రాజ్ నేతృత్వంలో ఏర్పాటు కాబోతోందన్నది సోకాల్డ్ మీడియా మేధావులు తెరపైకి తెచ్చిన ప్రచారం.

నిజానికి, ఈ ప్రచారం వెనుక ఓ ‘చల్లటి’ గ్యాంగ్ వుందనీ, డబ్బులిచ్చి మరీ ఈ దుష్ప్రచారం చేయించారనీ సినీ పరిశ్రమలో చెవులు కొరుక్కుంటున్నారనుకోండి.. అది వేరే సంగతి.

ప్రకాష్ రాజ్.. కర్నాటకకు చెందిన వ్యక్తి. అలా ఆయన కర్నాటకలో పుట్టాలని ఆయనగానీ, ఆయన తల్లిదండ్రులుగానీ కోరుకుని వుండరు కదా.? ఈ విషయాన్నే ప్రకాష్ రాజ్ ఇటీవల చెప్పారు. ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి, ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

తెలంగాణ రాజధాని హైద్రాబాద్‌లో వున్న ‘మా’ అసోసియేషన్‌కి మంచు విష్ణు కూడా అతిథి అనే చర్చ లేకపోలేదు. తెలంగాణ సమాజం రేప్పొద్దున్న ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు విష్ణుని, ‘నువ్వు అతిథివి..’ అంటే, ఆయన పరిస్థితి ఏంటి.? గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి వాదన వచ్చిన విషయాన్ని ఎలా విస్మరించగలం.?

రాజకీయాల్లో ప్రకాష్ రాజ్ వాదనలేంటి.? అన్నది వేరే చర్చ. ఆయన అభిప్రాయాలు ఆయనకు వుండొచ్చు. ‘మా’ విషయంలో ప్రకాష్ రాజ్, పరాయి వ్యక్తి ఎలా అవుతారు.? ‘అబ్బే, నేనలా అన్లేదు..’ అని విష్ణు నిన్న మాట మార్చినా, ఎన్నికల సమయంలో విష్ణు మాట్లాడిన మాటల తాలూకు వీడియోలు అలాగే వున్నాయ్.

మొత్తమ్మీద, ‘మా’లో చీలిక వచ్చే అవకాశం లేదని తేలిపోయింది ప్రకాష్ రాజ్ ప్రకటనతో. ఆత్మ, ప్రేతాత్మ.. అనే క్రియేషన్.. గంటల వ్యవధిలోనే కాలగర్భంలో కలిసిపోయింది. వాట్ నెక్స్‌ట్.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రశ్నలకు మంచు విష్ణు క్యాంప్ బెంబేలెత్తడమొక్కటే మిగిలి వుంది. ఎందుకంటే, నెలవారీ రిపోర్టుని మంచు విష్ణు నుంచి అడిగి మరీ, అందులోని లోటుపాట్లపై ప్రశ్నిస్తానని ప్రకాష్ రాజ్ అంటున్నారు మరి.


Recent Random Post: