ప్రధాని మోడీతో రఘురామ భేటీ.. ఏం హామీ దక్కిందో మరి.!

రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు, చర్చిల నిర్మాణం కోసం ప్రభుత్వమే టెండర్లను పిలవడం సహా పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ‘విజ్ఞాపన’ పత్రం అందించారట. 18 నిమిషాల పాటు ప్రధాని మోడీతో భేటీ జరిగిందని చెబుతోన్న రఘురామకృష్ణరాజు, అమరావతి విషయంలోనూ, స్టీల్ ప్లాంటు విషయంలోనూ ప్రధాని నుంచి సానుకూల స్పందన వచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో మత మార్పిడులు, చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలుస్తోన్న వైనం గురించి రఘురామకృష్ణ రాజు చెప్పగానే, ప్రధాని మోడీ ఆశ్చర్యపోయారట. నిజమేనా.?

రఘురామ చెబుతున్న విషయాలపై మోడీ నిజంగానే అంత సానుకూలంగా స్పందించారా? అన్న అనుమానాలు కలిగితే అది మీ తప్పు కాదు. ఎందుకంటే, రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై మోడీకి సమాచారం వుండదని ఎలా అనుకోగలం.? ఏపీ బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు తమ అధిష్టానికి అన్ని విషయాల్నీ నివేదిస్తున్నారు. కేంద్రానికి ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ వుంటుంది. దాన్నుంచి అవసరమైన సమాచారం రప్పించుకోవడం ప్రధాని మోడీకి కష్టమేమీ కాదు. సరే, ఎంపీ రఘురామకృష్ణంరాజుకి, ప్రధాని మోడీని కలిసే అవకాశం రావడం గొప్ప విషయమే. ముఖ్యమంత్రి సైతం ప్రధానితో భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్ కోసం వేచి చూసిన సందర్భాలెన్నో. దొరక్క, తిరిగొచ్చిన సందర్భాలు కూడా తక్కువేమీ కాదు. బీజేపీ పెద్దలతో రఘురామకు వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో రఘురామకి ఢిల్లీ ‘అపాయింట్‌మెంట్లు’ దొరకడం పెద్ద కష్టమేమీ కాదు.

నిజానికి, గతంలోనూ అమరావతి సహా పలు అంశాలపై రఘురామ, ఢిల్లీ పెద్దల్ని కలిశారు. కానీ, కేంద్రం పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కలిగించేలానే న్యాయస్థానాల్లో అఫిడవిట్లు దాఖలు చేయడం చూశాం. మిగతా విషయాల సంగతెలా వున్నా, బలవంతపు మత మార్పిడుల అంశం, రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరంగా మారుతోందన్న విమర్శలున్నాయి. చర్చిల నిర్మాణం విషయంపైనా నానా రకాల ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామ, ప్రధానికి చేసిన ఫిర్యాదు ఏమవుతుందో వేచి చూడాల్సిందే.


Recent Random Post: