జెట్ స్పీడ్ మోడ్ లో పవన్ కళ్యాణ్..?

సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టిన వారిలో టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ఒకరు. అప్పట్లో ‘ప్రజారాజ్యం’ పార్టీలో అనుబంధ సంస్థ యువరాజ్యం వ్యవహారాలను చూసుకున్న పవన్.. తర్వాతి రోజుల్లో ‘జనసేన’ పార్టీ స్థాపించి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజా సేవకే అంకితం అవ్వాలని నిర్ణయించుకొని కొన్నాళ్లు సినిమాలకు దూరమైపోయారు.

అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం చవిచూసిన తర్వాత పవన్ కళ్యాణ్ మనసు మార్చుకొని తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అటు సినిమాలు ఇటు రాజకీయాలు.. అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా సినిమాలను ఓకే చేయడమే కాదు.. ఒక మూవీ సెట్స్ మీద ఉండగానే మరో సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ‘వకీల్ సాబ్’ తో కంబ్యాక్ ఇచ్చిన పవన్.. ఇటీవల ‘భీమ్లా నాయక్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. రెండు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ సెట్స్ లో అడుగుపెట్టారు.

జెట్ స్పీడ్ తో సినిమా షూటింగ్స్ చేసి ఈ ఏడాది చివరి నాటికి కమిట్మెంట్స్ అన్నింటినీ పూర్తి చేయాలని పవన్ ప్లాన్ చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. 2024 లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జనసేన అధినేత సినిమాలని పక్కనపెట్టి ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నాడట. అందుకే నిర్విరామంగా చిత్రీకరణలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారట.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. ఎంఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే మూవీ అనౌన్స్ చేశారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని జూన్ నెలాఖరున లేదా జులై మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉందని టాక్. దీని కోసం ఇప్పటికే పవన్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పవన్ సన్నిహితుడు నిర్మాత రామ్ తాళ్లూరితో ఓ సినిమా చేయాల్సి ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

అలానే జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్స్ మీడియా బ్యానర్ పై ‘వినోదయ సీతమ్’ అనే తమిళ్ రీమేక్ మూవీకి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఆల్రెడీ అడ్వాన్సులు తీసుకున్న ప్రాజెక్ట్స్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారట. ఆ తర్వాత పూర్తిగా క్రియాశీలక రాజకీయాల మీద దృష్టి కేంద్రీకరించనున్నారని టాక్ నడుస్తోంది.


Recent Random Post: