జనసేన పార్టీలో జోష్‌ పెంచిన ‘వకీల్‌ సాబ్‌’.!

సినిమాకి వున్న పవర్‌ అలాంటిది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా జనసేన పార్టీకి ప్రధాన బలం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. జనసేన అధినేత.. అనే పిలుపు కంటే, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. అనే పిలుపునే జనసైనికులు అలియాస్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఇష్టపడతారు. ‘నేను సినిమాలు చేయడంలేదు, రాజకీయాలకే నా జీవితం అంకితం..’ అనగానే, జనసైనికులతోపాటు, జనసేన పార్టీలో చాలామంది నాయకులు నిరుత్సాహపడ్డారు.ఎందుకంటే, వాళ్ళందరికీ తెలుసు.. సినిమా గ్లామర్‌ ఏంటన్నది.

ఇక, జనసేన అధినేతగా పవన్‌ కళ్యాణ్‌ ఏం మాట్లాడినా.. అది వేరే కోణంలో వుంటుంది. అదే, సినీ నటుడు.. అలాగే జనసేన అధినేత హోదాలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడితే, ఆ కిక్‌ ఇంకో లెవల్‌లో వుంటుందని ‘వకీల్‌ సాబ్‌’ డైలాగ్‌తో స్పష్టమయ్యింది. ‘మీ సీఎం సాబ్‌కి చెప్పండి.. ఈ వకీల్‌ సాబ్‌ మాటగా..’ అని జనసేనాని పేల్చిన సినిమాటిక్‌ డైలాగ్‌ ఒక్కసారిగా తెలుగునాట రాజకీయాల్లో ప్రకంపనలే సృష్టించింది.

తెలంగాణ నుంచీ, ఆంధ్రప్రదేశ్‌ నుంచీ జనసేన పార్టీకి చెందిన నేతలు కొత్త ఉత్సాహాన్ని నింపుకున్నారు ‘వకీల్‌ సాబ్‌’ పొలిటికల్‌ డైలాగ్‌తో. అసలు జనసేనలో వున్న నేతలెవరు.? వారి కథేంటి.? అన్న అనుమానాలు చాలామందికి నిన్న మొన్నటిదాకా వుండేవి. ఇప్పుడు అవన్నీ పటాపంచలైపోయాయ్‌.

ఒకరా.? ఇద్దరా.? మొత్తంగా 175 నియోజకవర్గాల నుంచీ జనసేన నేతలు, తమ అధినేతపై వైసీపీ నేతలు చేసిన కామెంట్లను తిప్పికొట్టారు. ‘వీళ్ళంతా నిజంగానే జనసేన నాయకులేనా.?’ అన్న అనుమానాలు కొంతమంది జనసైనికులకే కలిగాయంటే ‘పవర్‌’ ఏ రేంజ్‌లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ‘మేం ట్రెండ్‌ మార్చుతున్నాం.. మీ దారిలోకే వస్తున్నాం..’ అని జనసేన నేతలు ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించాలి. ట్రెండ్‌ ఖచ్చితంగా మార్చాల్సిందే.

జనసేన మీద ఎవరు ఏ విమర్శ చేసినా, తిప్పికొట్టగల యంత్రాంగం ఖచ్చితంగా వుండి తీరాలి. ఏకంగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలపై.. జనసేన నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఖైదీ సాబ్‌’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై మండిపడుతున్నారు. ఇప్పుడెలాంటి రాజకీయాలున్నాయో, అలాంటి రాజకీయాలే చేయాలి తప్ప.. ‘మార్పు కోసం..’ అంటూ ముడుచుక్కూర్చుంటే సరిపోదు. సినిమాలూ చేయాలి.. సినిమాటిక్‌గా కనిపించాలి.. సినిమాటిక్‌గా మాట్లాడుతూనే, రాజకీయాల్లో పవర్‌ చూపించాలి.

ఇక, ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌లో మారాల్సింది ఇంకోటుంది. అదే, డ్రెస్‌ సెన్స్‌. ఇంకా తెల్ల బట్టలేసుకు తిరగడం అనవసరం. స్టైలిష్‌ పొలిటీషియన్‌గా పవన్‌ కళ్యాణ్‌ లుక్‌ మార్చేయాల్సిన సమయమొచ్చింది. అదొక్కటీ మారితే.. జనసేన ‘ట్రెండింగ్‌’ ఇంకో రేంజ్‌లో వుంటుంది.. ప్రత్యర్థులకీ వణుకు మొదలవుతుంది. ‘మీ పార్టీ నుంచి మా పార్టీలోకి రాబోయే నేతలున్నారు.. టైమ్‌ దగ్గర పడింది..’ అని జనసేన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు నిజమవ్వాలంటే, పవన్‌ కళ్యాణ్‌ జోరు ఇంకాస్త పెంచక తప్పదు. పెంచుతారా మరి.?


Recent Random Post: