హీరో నవదీప్ మీద ‘బులుగు’ దాడి.. ఇదేం రాజకీయ పైత్యం.?

దేశంలో కరోనా వైరస్ ఉధృతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతిరోజూ సరికొత్త రికార్డులే. ఆంధ్రపదేశ్ రాష్ట్రం ఇందుకు మినహాయింపేమీ కాదు. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. నిన్న 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నేడు 18 వేలు దాటతాయో, 20 వేలకు పరిస్థితి వెళుతుందో చెప్పలేం. ఇదిలా వుంటే, ఇంటర్మీడియట్.. అలాగే పదో తరగతి పరీక్షల విషయంలో మాత్రం జగన్ సర్కార్ వెనుకంజ వేసే ప్రసక్తే లేదంటోంది.

మరోపక్క, హైకోర్టు.. పరీక్షల నిర్వహణ విషయమై పునరాలోచించాలని సూచిస్తోంది. ఇదే అభిప్రాయాన్ని సినీ నటుడు నవదీప్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశాడు. గతంలో జరిగిన ప్రాక్టికల్ పరీక్షల కారణంగా పలువురు విద్యార్థులు కోవిడ్ బారిన పడినట్లు తనకు కొంతమంది చెప్పారనీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సబబు కాదనీ, ఈ విషయమై పునరాలోచించాలనీ నవదీప్ ట్వీటేశాడు. అంతే, నవదీప్ మీద ‘బులుగు కార్మికులు’ విరుచుకుపడ్డారు. బూతులు తిట్టేస్తున్నారు. పరీక్షలు రాయకుండా నీలా డ్రగ్స్ వాడమంటావా.? అంటూ అసందర్భ ప్రేలాపనలతో తమ పైత్యాన్నంతా ప్రదర్శించారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఈ రాజకీయ పైత్యం ఎక్కువైపోయింది. అక్కడ సమస్య ఏంటి.? వాస్తవ పరిస్థితి ఏంటి.? అన్నది బులుగు కార్యకర్తలకి అనవసరం. తమకు నెలవారీ దక్కుతున్న తాయిలం దక్కేసరికి, దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో పైత్యం ప్రదర్శించడమొక్కటే బులుగు కార్మికుల పనిగా కనిపిస్తోంది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించిన చర్చ ఇది. సరే, పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి.. అని ప్రభుత్వం భావిస్తే, ప్రస్తుతానికి పరీక్షల నిర్వహణను వాయిదా వేయొచ్చు.

దేశంలోని పలు రాష్ట్రాలు పరీక్షల్ని రద్దు చేసినప్పుడు, కేవలం ఆంధ్రపదేశ్ విద్యార్థుల పరీక్షలు రద్దయితేనే ఎలా వారి భవిష్యత్తుకి నష్టం కలుగుతుందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవివరంగా చెబితే బావుంటుంది. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి కరోనా సోకి, తాను పనిచేస్తున్న కార్యాలయంలో.. కుర్చీలోనే వున్నపళంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకిందన్న విషయమే అతనికి తెలియలేదాయె. చనిపోయిన సదరు ఉద్యోగికి కరోనా టెస్ట్ చేస్తే ఫలితం పాజిటివ్ అని తేలింది. ఇదీ రాష్ట్రంలో కరోనా పరిస్థితి. విద్యార్థులు, టీచర్లు, పరీక్షల నిర్వహణ కోసం వినియోగింపబడే సిబ్బంది.. ఇలా ఇంతమంది ప్రాణాల్ని పణంగా పెట్టడం ఎంతవరకు సబబు.?


Recent Random Post: