మెగా ఫ్రేమ్ అంటే ఇలా ఉంటుంది బాసూ!

అందరినీ ఒక చోట చేర్చేది .. అందరినీ ఒక్కటిగా చేసేదే పండుగ. పండుగలోని పరమార్థం కూడా ఇదే. కలిసి ఆనందాలు పంచుకోవడం .. సంతోషాలు పెంచుకోవడం .. సంబరాలు జరుపుకోవడం ఒక కొత్త ఎనర్జీని ఇస్తుంది. ఆ ఎనర్జీని పొందడానికి మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందుగానే ఉంటుంది. మెగా ఫ్యామిలీలోని వాళ్లంతా దాదాపు హీరోలే. అయినా వాళ్లంతా పండుగ వచ్చిందంటే చాలు ఒక చోట చేరిపోతారు. ప్రేమానురాగాలతో పెనవేసుకుపోతారు. సంక్రాంతి .. దీపావళి .. దసరా వంటి పండుగ రోజులలోనే కాదు క్రిస్మస్ రోజున కూడా అంతా కలిసి సందడి చేస్తారు.

అందమైన .. ఆనందమైన ఆ క్షణాలను జ్ఞాపకాలుగా పొందుపరుచుకుంటారు. ఆ క్షణాలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. నిన్న క్రిస్మస్ సంబరాలను కూడా అంతా కలిసి జరుపుకున్నారు. అందరూ కలిసి ‘మెగా ఫ్రేమ్’లో ఒదిగిపోయారు. ఈ ఫొటో మెగా ఫ్యామిలీలోని ఐక్యతకీ .. సఖ్యతకి అద్దం పడుతోంది. చరణ్ .. అల్లు అర్జున్ .. సాయితేజ్ .. వరుణ్ తేజ్ .. వైష్ణవ్ తేజ్ తో పాటు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత .. చిన్న కూతురు శ్రీజ .. నిహారిక దంపతులు ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రూప్ ఫొటో మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.

ప్రస్తుతం చరణ్ ‘ఆచార్య’ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తూ తదుపరి సినిమాకి సంబంధించిన పనుల్లో ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. వరుణ్ తేజ్ విషయానికి వస్తే ఆయన ‘గని’ సినిమా మార్చి 18వ తేదీన రానుంది. ఇక ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమా షూటింగుతో బిజీగా ఉన్నాడు. ఇక సాయితేజ్ – వైష్ణవ్ తేజ్ ఇద్దరూ కూడా తమ తరువాత సినిమాలకి సంబంధించిన పనుల్లో ఉన్నారు. సుస్మిత .. నిహారిక ఇద్దరూ కూడా వెబ్ సిరీస్ లతో తీరికలేకుండానే ఉన్నారు. ఇక కల్యాణ్ దేవ్ .. అల్లు శిరీష్ మాత్రమే ఈ ఫొటోలో మిస్ అయ్యారు.

ఇలా ఎవరికి సంబంధించిన పనులతో వారు బిజీగా ఉన్నప్పటికీ పండుగ రోజున అంతా కలుసుకోవడమనేది ఒక ఆరోగ్యకరమైన వాతావరణానికి అద్దం పడుతుంది. ఆహ్లాదకరమైన అలాంటి సమయాలు సంతోషంగా ఉంచుతాయి. ఇక వరుణ్ తేజ్ తాను చిరంజీవి ఇంట్లో పెరిగినట్టుగా చెబుతుంటాడు. చిరంజీవిని డాడీ అని నిహారిక పిలుస్తూ ఉంటుంది. తాను చిన్నప్పటి నుంచి వీలు దొరికితే చాలు చిరంజీవి ఇంటికి వెళ్లే వాడినని సాయితేజ్ చెబుతుంటాడు. ఇక చిరంజీవి స్ఫూర్తి తోనే తాను ఎదిగానని బన్నీ అంటూ ఉంటాడు. ఇదంతా చూస్తుంటే కుటుంబ బంధాలను నిలబెట్టుకుంటూ మెగా ఫ్యామిలీ ముందుకు వెళుతోందనే విషయం అర్థమైపోవడం లేదూ!


Recent Random Post: