‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం తన ప్యానెల్ సభ్యులతో కలిసి మంచు విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ విద్యానికేతన్ లో మీడియా సమావేశం నిర్వహించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా ఎన్నికల్లో గెలిస్తే శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నాను. నన్ను గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు. గెలుపోటములు సహజం. ఈసారి మేము గెలిచాం.. తర్వాత వారు గెలవొచ్చు.

పోలింగ్ సమయంలో చిన్నచిన్న గొడవలు జరిగాయి. ఇరువైపులా తప్పులున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచాం. ప్రకాశ్ రాజ్ కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చూసుకోవచ్చు. ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో నేను, పవన్ కల్యాన్ ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడుకోలేదు. అంతకుముందే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. స్టేజి మీద జరిగింది మాత్రమే మీడియాకు తెలిసింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకే స్టేజీపై పవన్ వీడియోను షేర్ చేశాను. చిరంజీవి గారు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. నాన్నతో చిరంజీవి ఫోన్లో మాట్లాడారు. ఆ విషయాలు నాన్నగారినే అడగాలి.

ప్రకాశ్ రాజ్, నాగబాబు గారి రాజీనామాలు మేము ఆమోదించడం లేదు. వారందరి రాజీనామా విషయం నేను మీడియాలోనే చూశాను. ఒక్కరి నుంచే రాజీనామా వచ్చింది. మిగిలిన వారి రాజీనామాలు వచ్చాక మేము కలిసి కూర్చుని చర్చించి.. పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు.

‘విష్ణు చదువుకున్న వ్యక్తి. సంస్కారం ఉంది. అందరినీ కలుపుకుపోతాడు. మ్యానిఫెస్టోని అంశాలన్నింటినీ నెరవేరుస్తాడు. మేమంతా ఒకే తల్లి బిడ్డలం. ఎన్నికల్లో జరిగినదాన్ని మేము మర్చిపోతున్నా.. ప్రత్యర్ధి ప్యానెల్ వదలట్లేదు. ఈ రెండేళ్లే కాదు.. ఆపై రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడిగా ఉంటాడు’ అని బాబూమోహన్ అన్నారు.

‘ఎన్నికల వరకే మేము ప్యానెల్స్ గా విడిపోయాం. ఎన్నికలయ్యాక మేమంతా ఒకటే. విష్ణు మ్యానిఫెస్టోనే మమ్మల్ని గెలిపించింది. మా సభ్యుల సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం’ అని మా వైస్ ప్రెసిడెంట్, నటుడు మాదాల రవి అన్నారు.


Recent Random Post: