ఫైనల్ మ్యాచ్ కోసం బాక్సింగ్ రింగ్ లో దిగిన ‘గని’


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ”గని”. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రెనసాన్స్ పిక్చర్స్ – అల్లు బాబీ కంపెనీ పతాకాలపై అల్లు బాబీ – సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యుల్ లోనే క్లైమాక్స్ బాక్సింగ్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారు.

కరోనా సెకండ్ వేవ్ తో ఆగిపోయిన ‘గని’ సినిమా షూటింగ్ ను పరిస్థితులు చక్కబడటంతో తిరిగి ప్రారంభించారు. క్లైమాక్స్ కోసం స్పెషల్ బాక్సింగ్ రింగ్ సెట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఫైనల్ మ్యాచ్ లకు సంబంధించిన హై ఇంటెన్సిటీ బాక్సింగ్ ఎపిసోడ్ లను చిత్రీకరించనున్నారు. ఇది వరుణ్ తేజ్ కెరీర్ లో వస్తున్న 10వ సినిమా.. ఆయన నటిస్తున్న మొట్ట మొదటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా. దీని కోసం మెగా హీరో బాక్సింగ్ శిక్షణ కూడా తీసుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి స్పెషల్ డైట్ ను మెయింటైన్ చేస్తూ భారీ వర్కౌట్స్ చేస్తూ వస్తున్నాడు.

‘గని’ చిత్రంలో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ ఉపేంద్ర – బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి – విలక్షణ నటుడు జగపతిబాబు – నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం రాకపోయి ఉంటే జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు చెప్పిన సమయానికి రిలీజ్ చేసే అవకాశం లేదు కాబట్టి.. త్వరలోనే తదుపరి విడుదల తేదీని ప్రకటించనున్నారు.


Recent Random Post: