ఇకపై ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్..?

దేశ ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు మొదలు కానుందని.. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

దీనికి సంబంధించిన అధ్యయనాన్ని ఈ ఏడాది మొదట్లో ప్రారంభించామని చెప్పారు. మద్రాసు ఐఐటీతోపాటు దేశంలోని ఇతర ఐఐటీల్లోని సాంకేతిక నిపుణుల సహకారంతో దీనిపై కసరత్తు చేస్తున్నట్టు వివరించారు. ఎన్నికల వ్యవస్థకు మరింత విశ్వసనీయత తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ విధానం రూపొందిస్తున్నట్టు అరోరా వెల్లడించారు.

రిమోట్ ఓటింగ్ అంటే ఆన్ లైన్ ఓటింగ్ కాదని, ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా కాదని ఆయన స్పష్టంచేశారు. తమ తమ నియోజకవర్గాలకు దూరంగా ఉన్న ఓటర్లు.. అక్కడకు వెళ్లకుండా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది.

టూ-వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ కలిగి ఉండే ఈ విధానంలో ఐపీ పరికరాలు, వెబ్ కెమెరా, బయో మెట్రిక్ డివైస్ ఉంటాయి. ఈ విధానంలో ఓటేయాలనుకునే ఓటర్లు.. నిర్దేశిత సమయానికి, ముందుగా నిర్ణయించిన ప్రాంతానికి రావాల్సి ఉంటుంది.


Recent Random Post: