అమరావతిపై వైఎస్ జగన్ – చంద్రబాబు ఆధిపత్యపోరులో గెలిచేదెవరు.?

ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంత.? వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంత.? ఈ లెక్కలు తీస్తే, కాస్తో కూస్తో చంద్రబాబు ప్రభుత్వానికే రెండు మూడు మార్కులు ఎక్కువ పడతాయేమో. వైఎస్ జగన్ సర్కార్ విషయానికొస్తే, పూర్తిగా మైనస్ మార్కులు పడతాయి.

దానర్థం, అమరావతి పేరుతో చంద్రబాబు వైఎస్ జగన్.. ఈ ఇద్దరూ చేసింది, చేస్తున్నది కేవలం పబ్లిసిటీ స్టంట్లు మాత్రమేనని చెప్పక తప్పదు. 2018 చివరి నాటికి అమరావతి ప్రాజెక్టు తొలి దశ పూర్తయిపోతుందని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతూ వచ్చారు. కానీ, ఆ ప్రాజెక్టుకి సంబంధించి ‘తాత్కాలికం’ తప్ప, శాశ్వతమైనవేవీ పూర్తి కాలేదు. కొన్ని శాశ్వత నిర్మాణాల ప్రారంభం మాత్రం జరిగింది.. అవేవీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ముందుకు సాగలేదు. కానీ, అమరావతి పేరుతో పబ్లిసిటీ స్టంట్లు అలాగే కొనసాగుతున్నాయి.

అమరావతి పేరుతో పెద్దయెత్తున భూ కుంభకోణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం పాల్పడిందన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. మంత్రి వర్గ ఉప సంఘం, సీఐడీ విచారణ.. ఇలా పెద్ద కథే నడుస్తోంది గడచిన రెండేళ్ళలో. 60 – 40 ఒప్పందాల్లో భాగంగా పసలేని విమర్శలు మాత్రమే వైసీపీ చేస్తోందా.? అంటే, గడచిన రెండేళ్ళలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే ఔననే వాదనకు బలం చేకూరుతుంది. రోజులు గడుస్తున్నాయ్.. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయ్. అమరావతిలో కుంభకోణం జరిగిందన్న వైసీపీ ఆరోపణలే నిజమైతే, వందల కోట్లు.. వేల కోట్లు టీడీపీ దోచేసిందన్న ఆరోపణలే నిజమైతే.. ఆ మొత్తం నుంచి ఎంత సొమ్ము వైసీపీ సర్కార్ రికవరీ చేసిందో వైసీపీ నేతలు చెప్పగలగాలి.

అప్పటి మంత్రి నారాయణ తన బినామీల పేరుతో వందలాది ఎకరాలు దోచేశారని వైసీపీ ఆరోపించింది. ఒక్క ఎకరం.. కాదు కాదు.. ఒక్క సెంటు భూమి అయినా వైసీపీ సర్కార్ రికవరీ చెయ్యగలిగిందా.? నారాయణ సంగతి తర్వాత.. చంద్రబాబు స్వయానా భూముల్ని దోచేశారంటున్న వైసీపీ.. ఒక్క సెంటు భూమిని చంద్రబాబు నుంచి లాక్కోగలిగిందా.? దళితుల భూముల్ని అడ్డగోలుగా దోచేశారని ఆరోపిస్తున్న వైసీపీ, ఆ దిశగా కేసులు పెట్టించినా.. ప్రయోజనం లేకుండా పోయింది.

ఎవరైతే బాధితులని వైసీపీ అంటోందో.. ఆ బాధితులే, మీడియా ముందుకొచ్చి.. తమ ఇష్టపూర్వకంగా ప్రభుత్వానికి భూములు ఇచ్చామని చెబుతుండడం గమనార్హం. ఈ కథ ఇక్కడితో ముగిసేది కాదు. అమరావతి వ్యధ.. ఇక్కడితో ఆగేదీ కాదు. వైఎస్ జగన్, చంద్రబాబు.. ఇద్దరూ ఈ యుద్ధంలో విజేతలే.. రాష్ట్ర ప్రజలే ఓడిపోతున్నారు.. ఈ ఇద్దరి ఆధిపత్య పోరులో.


Recent Random Post: