ఆ జనమేంది అల్లు అర్జునా?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ సినిమా తెరకెక్కింది. అడవి నేపథ్యంలోని కథ .. అల్లు అర్జున్ లుక్ .. దేవిశ్రీ పాటలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదనే టాక్ విడుదల రోజునే వచ్చేసింది.

అయినా ఒకరి టాక్ గురించి మరొకరు పట్టించుకోకుండా థియేటర్లను పలకరించి వస్తూనే ఉన్నారు. దాంతో ఈ సినిమా వసూళ్లు కళ్లెం వదిలిన గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. వసూళ్లకు సంబంధించిన డిజిట్స్ వెంటవెంటనే మారిపోతున్నాయి. దాంతో ఈ సినిమా సక్సెస్ పార్టీని తిరుపతి వేదికగా నిన్న నిర్వహించారు.

ఈ సక్సెస్ పార్టీకి 35 వేలకి పైగానే జనాలు తరలి వచ్చారు కనుచూపుమేరలో జనం .. జనం .. జనం. రవ్వపోస్తే రాలనంత జనం. ఒక వైపున ఒమిక్రాన్ కి సంబంధించిన వార్తలు భయపెడుతున్నా అదేమీ తమకి పట్టనట్టుగా పెద్ద సంఖ్యలో ఈ ఫంక్షన్ కి జనాలు రావడం నిజంగా విశేషమే. ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ జనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి.

అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోయిందనడానికి నిదర్శనంగా ఈ ఈవెంట్ కనిపిస్తోంది. ఆయన చిత్తూరు యాసలోనే అక్కడి జనాలను పలకరిస్తూ వాళ్లలో హుషారు రేకెత్తించాడు.

అల్లు అర్జున్ మంచి మాటకారి కూడా. ‘మీ అందరి వెనకాల ఆ ఏడుకొండలవాడు ఎలా ఉన్నాడో .. నా వెనక సుకుమార్ అలా ఉన్నాడు’ అంటూ ఒకే ఒక్క మాటలో సుకుమార్ పై తనకి గల నమ్మకాన్ని చాటుకున్నాడు. ఇక శ్రీవల్లి .. పుష్పకి మాత్రమే కాదు .. నాకు కూడా బాగా నచ్చిందంటూ చమత్కరించాడు.

ఇక దేవిశ్రీ ‘ఊ అంటావా .. ఊఊ అంటావా’ అనే పాటను ‘ఊ ఊ’ అనే ఆప్షన్ లేకుండా ఇచ్చాడు. ఈ ఆల్బమ్ తో అదరగొట్టేశాడు అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. ఇప్పుడు అల్లు అర్జున్ మాటలను గురించి కూడా అంతా మాట్లాడుకుంటున్నారు.

ఈ సక్సెస్ మీట్ వలన ఈ సినిమాపై మరింత హైప్ పెరిగేలా చేయడంలో అల్లు అర్జున్ సక్సెస్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. కథాపరంగా ఫస్టు పార్టు క్లైమాక్స్ .. సెకండ్ పార్టు పై ఉత్కంఠను కలిగించేలా లేదనే టాక్ వచ్చింది. కానీ ఈ సక్సెస్ ఈవెంట్ తరువాత ఆ అభిప్రాయం మారిపోయింది.

సెకండ్ పార్టు పై అంచనాలు పెంచడమనేది ఈ ఈవెంట్ తోనే మొదలుపెట్టారని చెప్పచ్చు. సెకండ్ పార్టు షూటింగు ఫిబ్రవరి నుంచి మొదలుకానుంది. ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఈ రోజు సాయంత్రం చెన్నైలో జరగనున్నాయి.


Recent Random Post: