హాస్య నటి గీతా సింగ్ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి

హాస్య నటి గీతా సింగ్ రోడ్డు ప్రమాదంలో తన కొడుకును కోల్పోయింది. హైదరాబాద్ లో జరిగిన ప్రమాదంలో ఆమె కుమారుడు మరణించినట్లు సమాచారం. గీతాసింగ్ సహనటి కరాటే కళ్యాణి తన సోషల్ మీడియాలో ఈ విచారకరమైన వార్తను షేర్ చేసారు. డ్రైవింగ్ చేసేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ విషాద సమయంలో ఇతరులను కోరారు.

గీతా సింగ్ కు వివాహం కాలేదు. ఆమె కోల్పోయిన కొడుకు దత్తపుత్రుడు. తన సోదరుడి కుమారులను గీతా దత్తత తీసుకుంది. పెద్దవాడు ఇటీవల జరిగిన ప్రమాదంలో విషాదకరంగా మరణించాడు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గీతా సన్నిహితురాలు కరాటే కళ్యాణి తన ఫేస్ బుక్ హ్యాండిల్ లో ఈ విషాదకర వార్తను షేర్ చేయడమే గాక తనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసారు “గీతా సింగ్ కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కారు లేదా బైక్ లో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా వెళ్లమని సలహా ఇవ్వండి. ఓం శాంతి“ అని వ్యాఖ్యను జోడించారు. తన స్నేహితురాలు ధైర్యంగా ఉండాలని కోరారు.

గీతా సింగ్ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. 2005లో `ఎవడి గోల వాడిది` సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. హాస్య నటిగా సహాయక పాత్రలో నటించారు. ఆ తర్వాత అల్లరి నరేష్ తో `కితకితలు` అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో గీతా 50 సినిమాల్లో నటించగా… శశిరేఖా పరిణయం-సీమ టపాకాయ్- సరైనోడు- కళ్యాణ వైభోగమే-తెలుగమ్మాయి- రాంబాబు గాడి పెళ్లాం- మొండి మొగుళ్లు పెంకి పెళ్లాలు ఇంకా ఎన్నో చిత్రాల్లో అత్యుత్తమ నట ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

గీతా సింగ్ చివరి చిత్రం `తెనాలి రామకృష్ణ BA BL`. ఈ చిత్రంలో సందీప్ కిషన్ కథానాయకుడు. హన్సిక మోత్వాని – వరలక్ష్మి శరత్కుమార్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే హాస్యప్రధాన చిత్రాల వెల్లువ ఇటీవల తగ్గడంతో పాటు పోటీ పెరిగింది. దీంతో అవకాశాలు తగ్గాయి. గీతా మంచి వ్యక్తిత్వం స్నేహపూర్వక స్వభావానికి పెట్టింది పేరు.

పలువురు దర్శకరచయితలు తన కోసం కొన్ని పాత్రల్ని సృష్టించారంటే తన మంచితనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తన కొడుకును కోల్పోయి విచారంలో ఉన్నారు.ఈ అపారమైన నష్టాన్ని తట్టుకోవాలని తనకు అండగా నిలుస్తామని తెలుగు చిత్ర పరిశ్రమ నుండి చాలా మంది ప్రముఖులు సానుభూతిని తెలియజేసారు. చాలా ఏళ్ల క్రితం కోట శ్రీనివాసరావు కుమారుడు బైక్ యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే.


Recent Random Post: