బాలయ్య మాస్ గాడ్ ఎందుకయ్యారంటే..?

నటసింహం బాలయ్య బాబు ఫ్యాన్ గా.. ఆయననే డైరెక్ట్ చేస్తున్నానంటే ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలి? అంటూ ఎమోషనల్ అయ్యారు దర్శకుడు గోపిచంద్ మలినేని. ఒక మాస్ గాడ్ ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు! కానీ ఆ అవకాశం నాకు వచ్చిందని అన్నారు. నేటి సాయంత్రం వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ వేదికపై గోపిచంద్ మలినేని స్పీచ్ ఆద్యంతం ఎమోషనల్ గా సాగింది.

మాస్ దేవుడు బాలకృష్ణ- నటసింహం మళ్లీ పవర్ ఫుల్ మాస్ చిత్రం `వీరసింహారెడ్డి`తో బరిలోకి వస్తున్నాడు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఈరోజు ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. అక్కడ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ ఒక బాలయ్య అభిమానిగా ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాకి పని చేసిన వారంతా బాలయ్య బాబు అభిమానులే. హృదయంతో ప్రేమించి నేను ఈ సినిమా చేశాను… అని అన్నారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని మరిన్ని విషయాలు మాట్లాడుతూ.. సమరసింహారెడ్డిని అభిమానిగా చూసినప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారు. 1999లో ఒంగోలులో సమరసింహారెడ్డి సినిమా చూడటానికి 20మంది పొరుగున ఉన్న పల్లె నుంచి సైకిళ్లపై వచ్చాం. ఆ 20 మంది ఇక్కడే ఉన్నారు. బాలయ్య అబిమానుల్లో ఒకరిగా నేను కూడా ఉన్నాను. ఆరోజు థియేటర్ వద్ద గొడవ జరిగింది. తీసుకెళ్లి లోనేశారు.. పోలీసులు రెండు పీకారు. ఆరోజు సినిమా చూడటం మిస్సయ్యాం! అని బాధపడ్డాం. మేం మళ్లీ పీఎస్ నుంచి బయటికి వచ్చాక నైట్ షో చూసి ఇంటికి వెళ్లాకే ప్రశాంతంగా ఉన్నాం. అలాంటి అభిమానిని. ఒక బాలయ్య బాబు అభిమానిగా ఆయన సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడంటే జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి. గొప్ప అభిమానులున్న మాస్ గాడ్ ని డైరెక్ట్ చేశానంటే అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు. ఒక డైరెక్టర్ గా నే కాదు ఒక అభిమానిగా బాలయ్యను చూసి సెట్స్ లో మురిసిపోయేవాడిని. నాలానే నిర్మాతలు బాలయ్యను అభిమానిస్తారు. సినిమా అంటే వారికి ప్రాణం. నాకు వెన్నెముకగా నిలిచారు… అని మలినేని అన్నారు.

బాలయ్య బాబు సినిమాకు దర్శకత్వం వహించడం నా జీవితంలో అతిపెద్ద విజయం. అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా బాలయ్యను ప్రొజెక్ట్ చేశానని చెప్పాడు. నిర్మాతల గురించి మాట్లాడుతూ.. నా నిర్మాతలు రవిశంకర్- నవీన్ యెర్నేని అందించిన సపోర్ట్ మర్చిపోలేనని గోపీచంద్ మలినేని అన్నారు. సినిమాలో హనీ రోజ్ పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని .. ఆమె అద్భుతంగా నటించిందని తెలిపారు. దునియా విజయ్ విలన్గా అద్భుతంగా నటించాడని గోపీచంద్ అన్నారు.

ఈ చిత్రంలో భానుమతి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిందని దర్శకుడు తెలిపారు. షూటింగ్ సమయంలో బాలయ్య సెట్స్ లో పడిపోయినప్పుడు జరిగిన సంఘటనను గోపీచంద్ మలినేని వివరించాడు. బాలకృష్ణ మళ్లీ లేచి నిలబడి తన షాట్ చేయడానికి ముందుకు రావడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన అన్నారు. ఆ సమయంలో తనకు కన్నీళ్లొచ్చేశాయని కూడా గుర్తు చేసుకున్నారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ తన టెక్నీషియన్స్- ఆర్టిస్టులందరూ సినిమాకు తమ బెస్ట్ ని అందించారని అందరూ బాలకృష్ణ అభిమానులేనని అన్నారు. బాలయ్యపై తమకున్న ప్రేమను సినిమాలో ప్రతిబింబిస్తానని అన్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా అద్భుతంగా నటించిందని వెల్లడించారు. శ్రుతిపై తన ప్రేమాభిమానాలను కూడా గోపిచంద్ మలినేని వేదికపై దాచుకోకుండా వ్యక్తం చేసారు. తనని ఒక సోదరిగా ప్రేమిస్తానని అన్నారు.

ఫ్యాన్స్ అంతా కలిసి చేసిన సినిమా వీరసింహారెడ్డి

వేదికపై మలినేని ఎమోషనల్ గా మాట్లాడుతూ.. బాలయ్య బాబు.. మీ మీద మా ప్రేమ వేరు. అభిమానిగా ప్రేమ ఇది. మిమ్మల్ని దగ్గరగా చూస్తుంటే.. ఆ ఆనందమే వేరు. ప్యూర్ హార్ట్ .. ప్యూర్ సోల్ ఉన్న మంచి మనిషి. మీకు చేతులెత్తి దండం పెడతాం.. అని అన్నారు. ఒక షాట్ లో యాక్షన్ సన్నివేశంలో ఆయన కింద పడిపోయారు. కానీ వెంటనే లేచి షాట్ కి రెడీ అన్నారు. సినిమా సెట్లో జరిగిన సన్నివేశంతో నాకు కళ్ల నీళ్లు వచ్చాయి. ఆయన మాస్ గాడ్ అయ్యారంటే దానివెనక ఈ డెడికేషన్ ఉందని గోపిచంద్ మలినేని గుర్తు చేసారు. ఈ చిత్రానికి థమన్ బావ అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చాడు. బావ సోల్ పెట్టి పని చేసాడు..అని పొగిడేశారు.


Recent Random Post: