అందుకే లావయ్యాను .. డాన్స్ చేయలేకపోయాను!


టాలీవుడ్ హీరోల్లో కథల ఎంపికలో విషయంలోను .. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ పొందడంలోను నాని తరువాత స్థానంలో శర్వానంద్ కనిపించేవాడు. శర్వానంద్ ఏ పాత్రను పోషించినా ఆ పాత్రలో ఆయన నటన పద్ధతిగా .. పరిధి దాటకుండా ఉంటుంది. ఏ సన్నివేశంలోను ఆయన అతి చేసినట్టుగా అనిపించదు. చాలా సహజంగా .. మనసుకు హత్తుకుపోయేలా ఆయన నటన ఉంటుంది. అలాంటి శర్వానంద్ కి ‘మహానుభావుడు’ తరువాత హిట్ పడలేదనే చెప్పాలి. ఆ సినిమా తరువాత ఆయన చేసిన అరడజను సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి.

‘జాను’ సినిమా తరువాత శర్వా మరింత లావవుతూ వచ్చాడు. ఆయన బరువు తగ్గవలసిన అవసరం ఉందంటూ రివ్యూల్లో కూడా రాస్తూ వచ్చారు. అయితే తాను బరువు పెరగడానికి కారణం ఉందంటూ ‘ఒకే ఒక జీవితం’ సినిమా ప్రమోషన్స్ లో ఆయన చెప్పుకొచ్చాడు.

దిల్ రాజు బ్యానర్లో నేను సమంతతో కలిసి ‘జాను’ సినిమాను చేశాను. 1996 నేపథ్యంలో ఆ కథ నడుస్తుంది. ఆ సినిమా లోని ఒక సన్నివేశంలో నేను ఫారిన్ లో స్కై డైవింగ్ చేయాలి. పారాచూట్ తో ల్యాండ్ కావడమనేది సరిగ్గా జరగలేదు. దాంతో నా భుజానికి పెద్ద గాయమైంది.

ఫారిన్ లో వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. కానీ నేను హైదరాబాద్ లోనే ఆపరేషన్ చేయించుకుంటానని పట్టుబట్టాను. హైదరాబాదులోనే ఆపరేషన్ జరిగింది. మూడు నాలుగు నెలల వరకూ షూటింగులు చేయడానికి కుదరదని చెప్పారు. కానీ కొన్నాళ్ల రెస్ట్ తరువాత షూటింగులలో పాల్గొన్నాను.

రెస్టు తీసుకుంటూ ఇంటిపట్టునే ఉండిపోవడం .. టాబ్లెట్స్ వలన ఆకలి కావడంతో ఎక్కువ తినేయడం వంటివి చేస్తూ రావడంతో బాగా బరువు పెరిగిపోయాను. బరువు తగ్గాలని నేను అనుకున్నాను .. నన్ను చూసినవాళ్లు కూడా అదే మాట అన్నారు.

ఇక ‘శ్రీకారం’ సినిమా సమయానికి కూడా నా చేయి పూర్తి స్వాధీనంలోకి రాలేదు. కొద్దిగా మాత్రమే చేయి పైకి లేచేది. ‘వత్తానంటివో పోతానంటివో’ పాటలో నా చేయి ఫ్రీగా కదలకపోవడం ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు చేయి దార్లోకి వచ్చేసింది .. కెరియర్ ను కూడా దార్లో పెట్టుకునే పనిలో ఉన్నాను. నా నుంచి ‘ఒకే ఒక జీవితం’ రానుంది. నా కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాను. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది” అంటూ చెప్పుకొచ్చాడు. శర్వా జోడీగా రీతూ వర్మ నటించిన ఈ సినిమాలో అమల అక్కినేని కీలకమైన పాత్రలో కనిపించనుంది.


Recent Random Post: