కోవిడ్ కుంటి సాకు: బులుగు రాజకీయం.. అంతా ఫేకు.!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి 300 రూపాయల టిక్కెట్ కొనుగోలు చేస్తే, కోవిడ్ 19 ఇబ్బందులుండవ్. అదే సర్వదర్శనానికి అయితే మాత్రం కోవిడ్ 19 సమస్యలొస్తాయ్. స్కూళ్ళు తెరిస్తే కరోనాతో ఇబ్బందులుండవ్.. సినిమా థియేటర్లు తెరవడానికీ కరోనాతో సమస్యలు రావు. అదే, వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మండపాలు ఏర్పాటు చేస్తే మాత్రం కరోనాతో చిక్కులొస్తాయ్. అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.

అధికార వైసీపీ నేతలు, రకరకాలుగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు.. నిత్యం రాష్ట్రంలో ఎక్కడికక్కడ జన సమీకరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. చిత్రంగా అక్కడెక్కడా పోలీసులు ‘కోవిడ్ 19’ నిబంధనల ఉల్లంఘన పేరుతో కేసులు నమోదు చేయరు. అదే విపక్షాలకు చెందిన నేతలెవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడితే, వెంటనే కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన.. అంటూ కేసులు బుక్ అయిపోతాయ్.

అధికార పార్టీ విషయంలో నిబంధనలు ఒకలా పనిచేస్తోంటే, విపక్షాల విషయంలో నిబంధనలు ఇంకోలా కనిపిస్తున్నాయి. బులుగు రాజకీయం ఏ స్థాయికి దిగజారిపోయిందంటే.. ఇదిగో, వినాయక చవితి ఉత్సవాల వ్యవహారం కూడా, విపక్షాల రాజకీయ కార్యక్రమంలా కనిపిస్తున్నట్టుంది అధికారంలో వున్నవారికి.

పది మండపాలు పెట్టే చోట రెండింటికే అనుమతిస్తే సరి. మండపాల నిర్వహణ విషయమై ఖచ్చితమైన నంబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటే సరి. అది మానేసి, అసలు మండపాలే పెట్టొద్దని అంటే ఎలా.? అలాంటప్పుడు రాజకీయ పార్టీలు, రాజకీయ కార్యక్రమాలు కూడా చెయ్యకూడదు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం జనాన్ని సమీకరించకూడదు. సినిమా థియేటర్లు నడవకూడదు, పర్యాటక ప్రాంతాలూ తెరవకూడదు. స్కూళ్ళనూ మూసెయ్యాలి. కానీ, అవన్నీ బాగానే వున్నాయ్.

ప్రభుత్వ పెద్దలకు ఎవరో తప్పుడు సలహాలు ఇస్తుండడం వల్లే ఇలాంటి వివాదాలు తెరపైకొస్తున్నాయన్న వాదనలు లేకపోలేదు. నిజమే, దేశంలో కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి వుంది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి. ప్రజలు దాన్నొక బాధ్యతగా భావించాలి. కానీ, పాలకులు చేస్తున్నదేంటి.? వాళ్ళకు నిబంధనలు వర్తించడంలేదు. బహిరంగ సభల్లోనూ మాస్కులు ధరించడంలేదు అధికార పార్టీ నాయకుల్లో చాలామంది. వాళ్ళపై చర్యలుండటంలేదు.

నిబంధనలు కేవలం సామాన్యల్ని ఇబ్బంది పెట్టడం కోసం, ప్రజల సెంటిమెంట్లను దెబ్బ కొట్టడం కోసమేనంటే అది సమర్థనీయం కానే కాదు.


Recent Random Post: