దేశానికి అవసరం.. ఆంధ్రప్రదేశ్‌కి అక్కర్లేదా మోడీజీ.!

‘కేంద్రం నిధులు ఇస్తే, చంద్రబాబు తాత్కాలిక అసెంబ్లీ కట్టారు.. మేం ఇచ్చిన నిధుల్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు..’ అంటూ గత కొన్నేళ్ళుగా భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు నేతలు, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న విషయం విదితమే. కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అమరావతి కోసం కొంత మేర నిధులు ఇచ్చిన మాట వాస్తవం.

చంద్రబాబు తాత్కాలిక అసెంబ్లీని నిర్మించిన మాట కూడా వాస్తవం. కానీ, అప్పట్లో టీడీపీ – బీజేపీ మిత్రపక్షాలే. రెండూ కలిసి ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో పరిపాలన చేశాయి.. ఆ తర్వాత విడిపోయాయి. అంటే, టీడీపీ చేసిన ‘తాత్కాలిక పాపం’లో బీజేపీకి కూడా వాటా వున్నట్లే కదా.! తాజాగా, కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌, కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు. పార్లమెంటు గొప్పతనం గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు. బాగానే వుంది. కొత్త పార్లమెంటు భవనం అవసరమే.

ఎందుకంటే, ఇప్పటిదాకా వున్న పార్లమెంటు భవనం చాలా పాతది గనుక, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సౌకర్యవంతంగా కొత్త పార్లమెంటు నిర్మించుకోవడం దేశానికి అవసరం. మరి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా అసెంబ్లీ వుండాలి కదా.! రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు, ఆ నిధులు సద్వినియోగమవుతున్నాయా.? దుర్వినియోగమవుతున్నాయా.? అన్నది చూసుకోకపోతే, అది బాద్యతారాహిత్యమే అవుతుంది కేంద్రానికి సంబంధించి. చంద్రబాబు తప్పు చేసి వుంటే, ఆయనపై చర్యలు తీసుకోవాలి. కానీ, అలా చేయదు కేంద్రంలోని మోడీ సర్కార్‌.

ఎందుకంటే, మోడీ సర్కార్‌కి రాజకీయమే అవసరం తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు. ఇక, రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, అమరావతిని ప్రస్తుతానికైతే గాలికొదిలేసింది. రాజధానిగా అమరావతిని పిలవాలా.? వద్దా.? అన్నది తెలియని పరిస్థితి. దేశాన్ని ఉద్దేశించి గొప్పగా పార్లమెంటు ఆవశ్యకత గురంచి వివరించిన ప్రధాని మోడీ, ఇప్పటికైనా తాను శంకుస్థాపన చేసిన అమరావతి విషయాన్నీ కాస్త పట్టించుకుంటే మంచిదేమో.! రాష్ట్ర రాజధాని సహా కీలక అంశాలపై ప్రధాని పట్టించుకోరుగానీ, రాష్ట్రంలో బీజేపీకి పెత్తనం అవసరం.. రాజకీయంగా బలపడి, ఏకంగా అధికారంలోకి వచ్చేయడం అవసరమంటే ఎలా సాధ్యం.?

Share


Recent Random Post: