కొడాలి కామెంట్: పేకాటాడితే ఉరిశిక్ష వేసేస్తారా.?

అధికారంలో ఎలాంటోళ్ళున్నారు.. వాళ్ళని చూసి, వాళ్ళ ఫాలోవర్స్ ఎలా తయారవుతున్నారనడానికి ఇదొక నిదర్శనం. సభ్య సమాజానికి సాక్ష్యాత్తూ ఓ మంత్రి ఇస్తున్న సందేశం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. మంత్రి కొడాలి నాని.. అంటే, బూతులకు కేరాఫ్ అడ్రస్. ‘మా ఇంటర్వ్యూలో బూతులు నిషిద్ధం.. దయచేసి బూతులు మాట్లాడొద్దు..’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి మరీ, ఓ మహిళా జర్నలిస్ట్ ఇటీవల కొడాలి నానితో ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వచ్చిందంటే, సదరు మంత్రి గారి బూతుల పంచాంగం ఎంత ఘాటుగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఆ సంగతి పక్కన పెడదాం.

తాజాగా మంత్రిగారి అనుచరులు కొందరు పేకాడుతూ పోలీసులకు చిక్కరాట. ఆడుతూ కాదు, పేకాట క్లబ్బు నిర్వహిస్తూ బుక్కయ్యారనే ప్రచారం జరుగుతోంది. కోట్లాది రూపాయల సొమ్మని నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. ఈ విషయమై పెద్దయెత్తున రాజకీయ రచ్చ చోటు చేసుకున్న విషయం విదితమే. మంత్రిగారు తన అనుచరుల విషయమై హుటాహుటిన ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళారట. ఇదే అంశానికి సంబంధించి మంత్రిగారిని ప్రశ్నిస్తే.. ‘పేకాడితే ఉరి శిక్ష వేసెయ్యరు కదా.. నా అనుచరులూ పేకాడుతూ వుండొచ్చు. జరీమానా కడతారు, మళ్ళీ ఆడతారు.. దీనికోసం నేను ముఖ్యమంత్రి దగ్గరకు పరిగెత్తుకు రావడమేంటి..’ అంటూ మంత్రిగారు వ్యాఖ్యానించేసరికి మీడియా ప్రతినిథులు షాక్‌కి గురయ్యారు.

మంత్రిగారు అంతే.. ఏదన్నా చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు. అసలాయన తానొక మంత్రినన్న విషయాన్ని గుర్తెరిగే మాట్లాడతారా.? అన్న డౌట్ కూడా వస్తుంటుంది చాలామందికి. కానీ, ఆయన మాత్రం అవేవీ పట్టించుకోరు. ఇటీవల రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు పెరిగిపోతోన్న విషయం విదితమే. కొద్ది రోజుల క్రితం ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసమయితే, ఆ ఘటనపై స్పందిస్తూ, విరిగింది బొమ్మ చెయ్యే కదా.. అని లైట్ తీసుకున్నారు ఈ మంత్రిగారు. సో, మంత్రి కొడాలి నోట, పేకాడితే ఉరిశిక్ష విధించేస్తారా.? అన్న రీతిలో లైటు డైలాగులు కాక, పేకాట క్షమించరాని నేరం.. అనే డైలాగులు వస్తాయా.?

మంత్రిగారి ఇలాకాలో పేకాట క్లబ్బులు పెరిగిపోయాయని మొన్నీమధ్యన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తే, అసలు పేకాట క్లబ్బులే తమ నియోజకవర్గాల్లో లేవంటూ కొడాలి నాని సెలవిచ్చారు.. అంతేనా, పవన్ కళ్యాణ్‌ని షకీలా సాబ్.. అంటూ ఎగతాళి చేశారు. అలా కొడాలి నాని ఎగతాళి చేసి ఎన్నో రోజులు కూడా గడవలేదు.. సొంత నియోజకవర్గంలో అనుచరులే పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. ఇదీ రాష్ట్రంలో అధికార పార్టీ పెద్దల తీరు.. ప్రభుత్వ పెద్దల తీరు.


Recent Random Post: