మాస్ పోస్టర్ తో ‘పుష్ప’ ప్రీ రిలీజ్ పార్టీ అప్డేట్..!

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ”పుష్ప”. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

తెలుగు హిందీ కన్నడ మలయాళం తమిళ భాషల్లో విడుదల కానున్న ‘పుష్ప’ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు – టీజర్ – సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవల రిలీజ్ చేయబడిన ట్రైలర్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది.

‘పుష్ప’ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డిసెంబర్ 12వ తేదీన గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్ యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఆదివారం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని మేకర్స్ గురువారం అధికారికంగా వెల్లడించారు.

”థియేటర్లలో మాస్ పార్టీ కి ముందు మాస్ వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో చెప్పే ఒక గ్లిమ్స్.. ‘పుష్ప’ మాస్సివ్ ప్రీ రిలీజ్ పార్టీ” అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు సంబంధించిన సరికొత్త పోస్టర్ ని వదిలారు. పుష్పరాజ్ గెటప్ లో ఉన్న బన్నీ ఇంట్రన్స్ గా చూస్తూ ఉన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నటీనటులు సాంకేతిక నిపుణులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యే అవకాశం ఉంది. ఎవరెవరు వస్తారనే దానిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే రేపు శుక్రవారం ‘పుష్ప’ చిత్రం నుంచి ఐదో పాట విడుదల కానుంది.

‘ఊ అంటావా.. ఊహు అంటావా..’ అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలసి స్టార్ హీరోయిన్ సమంత కాలు కదపనుంది. ‘పుష్ప’ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఫహాద్ ఫాజిల్ – సునీల్ – అనసూయ – రావు రమేష్ – ధనుంజయ – శత్రు – అజయ్ – అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు.

‘పుష్ప’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించారు. కార్తీక శ్రీనివాస్ – రూబెన్ ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేయగా.. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ చేశారు.


Recent Random Post: