ఏపీ – తెలంగాణ ‘వాటర్ ఫైట్’: డీపీఆర్ కోరుతున్న కేంద్రం

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి పరిష్కారం కోసం ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలంటూ కేంద్రం, ఇటు ఆంధ్రపదేశ్ అలాగే అటు తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టమైన సూచన చేశారు. ఆంధ్రపదేశ్‌కి సంబంధించి 19, తెలంగాణకు సంబంధించి 14 ప్రాజెక్టుల తాలూకు డీపీఆర్‌లు సమర్పించాలన్నది కేంద్రం చేసిన సూచన.

ఇరు రాష్ట్రాలూ ఆయా ప్రాజెక్టులపై పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, కేంద్రానికి ఫిర్యాదులు చేసుకోవడం తెలిసిన విషయమే. ముఖ్యమంత్రుల స్థాయిలో ఏపీ – తెలంగాణ మధ్య పలు మార్లు ఆయా ప్రాజెక్టులపై చర్చలు జరిగినా, ‘కలిసి సమస్యను పరిష్కరించుకుంటాం’ అని ఇరువురు ముఖ్యమంత్రులూ ప్రకటించినా, జల వివాదాలు కొలిక్కి రాలేదు. ఆంధ్రపదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి లోబడి ఆయా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలన్నది కేంద్రం చెబుతున్న మాట.

అయితే, ఇన్నేళ్ళుగా వివాదాలు నడుస్తున్నా కేంద్రం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం, ఇప్పుడు తీరిగ్గా డీపీఆర్ వ్యవహారాలపై వివరణ కోరడంతో, రాజకీయంగా ఈ అంశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను అడ్డంపెట్టకుని రాజకీయంగా బలపడేందుకు బీజేపీ వ్యూహం పన్నిందా.? అన్న అనుమానాలు తెరపైకొస్తున్నాయి. అదే సమయంలో, నీటి వివాదాల జోలికి వెళితే, జరిగే రాజకీయ రచ్చ బీజేపీకి చేటు చేస్తుంది తప్ప, రాజకీయంగా ఎలాంటి మేలూ కమల దళానికి ఇరు రాష్ట్రాల్లోనూ జరగదన్నది ఇంకో వాదన.

ఒక్కటి మాత్రం నిజం.. జల వివాదాలంటే రాత్రికి రాత్రి పరిష్కారమయ్యేవి కావు. ఒకవేళ అలా జరగాలంటే, ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాధినేతలకు చిత్తశుద్ధి వుండాలి. అదే వుంటే, అసలు వివాదాలెందుకు తెరపైకొస్తాయి.? అన్నది అసలు సిసలు చర్చ. ఆయా వివాదాలతో రాజకీయ లబ్ది కోసమే అధికారంలో వున్నవారు, విపక్షాలుగా వున్నవారూ వ్యవహరించడం ఎన్నో దశాబ్దలుగా నడుస్తున్న చరిత్రే.


Recent Random Post: