వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ అప్పుడలా, ఇప్పుడిలా.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా సీబీఐ చిత్ర విచిత్రమైన వాదనల్ని సందర్భానుసారం వినిపిస్తోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, బెయిల్ రద్దు విషయమై సీబీఐ ఎటూ తేల్చుకోలేకపోయింది. ‘కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చు..’ అని చేతులు దులిపేసుకుంది సీబీఐ.

కానీ, విచారణకు వ్యక్తిగతంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు విషయమై భిన్న వాదనల్ని సీబీఐ తెరపైకి తెచ్చింది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వున్నారనీ, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు గనుక, సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా వుంటుందనీ సీబీఐ వాదిస్తోంది.

వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మినహాయింపు ఇవ్వొద్దన్నది సీబీఐ తాజా వాదన. అయితే, గడచిన రెండున్నరేళ్ళలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూనే వస్తున్నారు. దాంతో, విచారణ జరుగుతున్న తీరుపైనా, సీబీఐ వ్యవహార శైలిపైనా రాజకీయ విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి.

సరే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో దోషిగా తేలతారా.? క్లీన్ చిట్ పొందుతారా.? అన్నది కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. ఏళ్ళ తరబడి విచారణ సాగుతూ సాగుతూ వుండడం, అదే సమయంలో కొత్త కొత్త అనుమానాలు తెరపైకొస్తుండడం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

ప్రధానంగా ‘పంజరంలో చిలక’ అనే విమర్శల్ని చాలాకాలంగా ఎదుర్కొంటున్న సీబీఐ, వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో పట్టు సడలించిందా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీబీఐ నుంచి ఇంతలా భిన్నమైన వ్యవహార శైలి కన్పిస్తుండడంతో.. అక్రమాస్తుల కేసుల నుంచి వైఎస్ జగన్ తెలివిగా తప్పించుకుంటున్నారన్నది వివిధ రాజకీయ పార్టీల నుంచి వినిపిస్తోన్న వాదన.


Recent Random Post: