ఉప్పెన: విజయ్‌ సేతుపతి అందుకే డబ్బింగ్‌ చెప్పలేదు..

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ఉప్పెన సినిమాతో మరోసారి తెలుగు తెరపై కనిపించనున్నారు. ఈ సారి పుల్‌లెన్త్‌ రోల్‌ చేయనున్నారు. తెలుగులో మొదటి సినిమా అయిన సైరా నరసింహారెడ్డిలో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నారు. అయితే ఈ సారి ఉప్పెనలో చేస్తున్న హీరోయిన్‌ తండ్రి రాయనం పాత్రకు మాత్రం డబ్బింగ్‌ ఆర్టిస్ట్, నటుడు బొమ్మాలి రవి శంకర్‌తో డబ్బింగ్‌ చెప్పించారు. ట్రైలర్‌ విడుదలైన తర్వాత విజయ్‌ సేతుపతి డబ్బింగ్‌ వాయిస్‌పై మిశ్రమ స్పందన వచ్చింది. ట్రైలర్‌ చూసిన చాలా మంది నెటిజన్లు విజయ్‌ నటనకు తగ్గట్టు ఆ వాయిస్‌ సెట్‌ అవ్వలేదని కామెంట్లు చేయటం మొదలుపెట్టారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు బుచ్చిబాబు దీనిపై స్పందించారు. ‘‘ రాయనం పాత్రకు తన వాయిస్‌ సెట్‌ అవ్వదని విజయ్‌ సేతుపతి గారు చెప్పారు. గతంలో ఆయనకు డబ్బింగ్‌ చెప్పిన నటుడు అజయ్‌, మరికొంతమందితో డబ్బింగ్‌ చెప్పిద్దామని అనుకున్నాం. చివరకు బొమ్మాలి రవి శంకర్‌ను ఫైనల్‌ చేశాం. మామూలుగా ఆయన ఒక రోజులోనే పాత్రలకు డబ్బింగ్‌ చెబుతారు. అలాంటిది రాయన్న పాత్రకు డబ్బింగ్‌ చెప్పటానికి మూడు రోజులు టైం తీసుకున్నారు’’ అని అన్నారు.

కాగా, మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. చిత్ర హీరోయిన్‌ కృతి శెట్టికి కూడా ఇది మొదటి సినిమా. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 12(రేపు)న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Recent Random Post: