‘పింక్’ కలర్ మార్చకుండా పవర్ జోడించిన ‘వకీల్ సాబ్’

పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంటుంది. మెగాభిమానుల్లో అంచనాలు ఉంటాయి. పవన్ అభిమానుల్లో అయితే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అయితే.. పవన్ సినిమాలు చేయడం మానేసి మూడేళ్లు దాటింది. మళ్లీ చేస్తారో లేదో అనే మీమాంశ నుంచి సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించి వరుసగా సినిమాలు లైన్లో పెట్టారు. అలా మొదటిగా చేసిన సినిమానే ‘వకీల్ సాబ్’. బిగ్ బీ అమితాబ్, తాప్సీ తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్టవడమే కాకుండా.. క్లాసిక్ గా నిలిచింది. అయితే.. ఈ సినిమును తెలుగులో తెరకెక్కిస్తున్నారనగానే అందరిలో సందేహం.. సినిమా ఒరిజినల్ ఫ్లేవర్ చెడగొడతారా..? అని. ఇందుకు కారణం లేకపోలేదు.

పింక్ సబ్జెక్ట్ లో హీరోయిజం ఉండదు. కథే ఉంటుంది. కోర్ట్ రూమ్ డ్రామా ఉండదు. నేచురల్ గానే ఉంటుంది. హీరోయిజం ఎలివేషన్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్, హీరోయిన్, సాంగ్స్ ఉండవు. కానీ.. పవన్ కల్యాణ్ సినిమాలో ఇవన్నీ ఉండాలి. అప్పుడే ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు. ఆడియన్స్ ఓకే చేస్తారు. ఇవేమీ లేని పింక్ కు పవన్ న్యాయం చేయడమంటే కథను మళ్లీ వండేస్తారు.. ఒరిజనల్ మ్యాజిక్ ను పక్కదారి పట్టిస్తారు అనే సందేహాలు బాగా వ్యక్తమయ్యాయి. యాంటీ ఫ్యాన్స్ కూడా దీనిపై కామెంట్లు గట్టిగానే చేశారు. మొత్తానికి పింక్ అనే సాదాసీదా టైటిల్ ఇక్కడ వకీల్ సాబ్ అయింది. సినిమా వచ్చింది. ఓపెనింగ్ షో పూర్తవడమే ఆలస్యం.. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. కామెంట్స్ చేయడానికి విమర్శకులకు అవకాశం చిక్కలేదు.

కథ మెయిన్ ప్లాట్ పక్కకు వెళ్లకుండా మిగిలినదంతా మార్చినా ఎక్కడా కథకు డ్యామేజ్ జరగలేదు. హీరోయిజం ఎలివేషన్, ఫ్లాష్ బ్యాక్, కోర్ట్ రూమ్ డ్రామా.. ఎక్కడా తేడా కొట్టలేదు. దీంతో వకీల్ సాబ్ మరో ఫ్రెష్ సబ్జెక్ట్ అన్నట్టుగా ఆకట్టుకుంది. మూడు రోజులైనా.. కరోనా భయాలున్నా ధియేటర్ల వద్ద కలెక్షన్ల దుమ్ము దులిపేస్తోంది. 1997లో భారీ మాస్ ఇమేజ్ నుంచి 5గురు చెల్లెళ్లకు అన్నయ్యగా బరువైన పాత్రలో అభిమానులను, ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు చిరంజీవి. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అంతే బరువైన పాత్రతో అభిమానులను, ప్రేక్షకులను మెప్పించారు. దీంతో పవన్ పింక్ కలర్ మార్చకుండా కొత్త రంగులద్ది కలర్ ఫుల్ గా మార్చారని చెప్పాలి.


Recent Random Post: