మా ఎన్నికల తరువాత అసలైన సినిమా… ?


మా ఎన్నికలు టాలీవుడ్ లో ఎవరెటో స్పష్టంగా చెబుతున్నాయి. అయితే ఈ స్నేహాలు ఈ కలయికలు శాశ్వతమా అంటే అది కూడా కాదు అనుకోవాలి. ఎన్నికలు అయిపోయాక ఎవరు గెలిచినా చాలా మంది నటులు మాత్రం కలసిపోతారు. అది వారికి తప్పదు కూడా. కానీ మిగిలిన వారు అంటే తెర వెనక ఉన్న వారు మాత్రం ఇప్పటప్పట్లో కలిసే అవకాశాలు లేవు అంటున్నారు. టాలీవుడ్ లో మా ఎన్నికలు పెట్టిన చిచ్చు అలా కొన్నాళ్ళ పాటు రాజుకుంటూనే ఉంటుంది అంటున్నారు. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి.

ముందుగా చెప్పుకోవాలి అంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మెగా క్యాంప్ మద్దతు ఇవ్వడం పట్ల సీనియర్ నటుడు మోహన్ బాబు గుర్రు మీద ఉన్నారని అంటున్నారు. ఆ విషయాన్ని ఆయన ఎక్కడా దాచుకోలేదు కూడా. ఒక చానల్ ఇంటర్వ్యూలో ఆయన తన బాధను చెప్పేసుకున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా పోటీ చేస్తే తన కుమారుడు తప్పుకునే వాడు అన్నారు. మొత్తానికి ఆయన స్నేహమంటే ఇదా అంటూ ఆవేదన కూడా చెందారు. ఇక రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా మా ఎన్నికల తరువాత సమాధానం చెబుతాను అని మోహన్ బాబు అన్నారు. అంటే ఆ బాకీ అలాగే ఉంది అన్న మాట.

మరి మోహన్ బాబు ఎలా సమాధానం ఇస్తారు ఆయన పేల్చే బాంబులేంటి అన్న ఆసక్తి అయితే అటు ఇండస్ట్రీలోనూ ఇటు బయట కూడా ఉంది. ఇక మా ఎన్నికలలో మంచు విష్ణు ప్యానల్ గెలిస్తే కధ ఒకలా ఉంటుంది. ప్రకాష్ రాజ్ గెలిస్తే మరోలా సినిమా ఉంటుంది అని కూడా అంటున్నారు. ఇక ఏకగ్రీవానికే అంతా ట్రై చేశాం కుదరకపోవడం వల్లనే ఎన్నికలు వచ్చాయని సీనియర్ నటుడు మురళీ మోహన్ చెప్పారు. అంటే ఏకాభిప్రాయం అన్నది లేదు అన్నది తేలుతున్న వేళ మా ఎన్నికలు జరిగినా కూడా టాలీవుడ్ ఒక్క త్రాటి మీద సాగుతుందా అన్నదే అతి పెద్ద ప్రశ్నగా ఉంది. మొత్తానికి మా ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల తరువాత ఏం జరుగుతుంది అన్న ఆసక్తి కూడా అందరిలో ఉంది.


Recent Random Post: