‘పుష్పక విమానం’ ట్రైలర్: పెళ్ళైన వారానికే పెళ్ళాం లేచిపోతే..!


సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సోదరుడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం “పుష్పక విమానం”. నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు – ‘కళ్యాణం కమనీయం’ ‘చిలకా’ పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు.

గవర్నమెంట్ టీచర్ అయిన ఆనంద్ దేవరకొండ పెళ్ళైన వారానికే తన భార్య లేచిపోతే.. పరువు పోతుందని ఆ విషయాన్ని దాచి పెట్టడానికి ఎలాంటి తంటాలు పడాడు అనేది ఈ ట్రైలర్ లో ఫన్నీగా చూపించారు. ఇంటి ముందు ముగ్గు వేయడం సారీ కట్టుకొని పాలు తీసుకోవడం.. హోటల్ నుంచి బిరియాని తీసుకొచ్చి వైఫ్ చేసిందని చెప్పడం వంటివి నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టగా.. ఇన్స్పెక్టర్ సునీల్ ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్నారు.

అయితే ఒకానొక సందర్భంలో తన భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందనే విషయాన్ని బయటపెట్టాల్సి వచ్చింది. ఆమె ఓ బాడీ బిల్డర్ తో వెళ్లిపోయిందని తెలుసుకొని అతనితో గొడవకు దిగడాన్ని చూపించారు. అయితే సునీల్ విచారణతో ఆమె లేచిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ మిస్సింగ్ వెనుక ఆనంద్ దేవరకొండ హస్తం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి అంశాలతో పుష్పక విమానం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఫన్నీగా సాగింది.

ఆనంద్ దేవరకొండ తన భార్యతో మళ్ళీ కలుస్తారా? ఆమె వెళ్లిపోడానికి కారణమేంటి? అసలు ఆనంద్ చెప్పే దాంట్లో నిజమెంత? దీనికి పుష్పక విమానం టైటిల్ పెట్టడానికి కారణమేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పెళ్లి తర్వాత ఓ మిడిల్ క్లాస్ యువకుడి లైఫ్ లో జరిగిన వాస్తవ సంఘటనలకు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ కథను అల్లుకున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వంటి సూపర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ మరోసారి కంటెంట్ ప్రాధాన్యం ఉన్న సినిమాతో వస్తున్నారని ‘పుష్పక విమానం’ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

పెళ్ళాం లేచిపోయిన గవర్నమెంట్ టీచర్ పాత్రలో ఆనంద్ అలరించారు. ఇందులో గీత్ సైని – శాన్వి మేఘన హీరోయిన్లుగా నటించగా.. సునీల్ – నరేష్ – హర్షవర్థన్ – అజయ్ – సుదర్శన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. రామ్ మిరియాల – సిద్దార్థ్ సదాశివుని – అమిత్ దాసాని ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం అందించారు. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందించగా.. నీల్ సెబాస్టియన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. రవితేజ గిరిజాల ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు.

విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ – విజయ్ మట్టపల్లి – ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు. “పుష్పక విమానం” చిత్రాన్ని ఆంధ్రా మరియు సీడెడ్ ఏరియాలలో సురేష్ ప్రొడక్షన్స్.. నైజాంలో గ్లోబల్ సినిమాస్.. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ రిలీజ్ చేస్తోంది.


Recent Random Post: