‘ప్రతీ ఇంట్లో టక్ జగదీష్ లాంటి కొడుకు ఉండాలని అనుకుంటారు’


నేచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నాని సరసన రీతూ వర్మ – ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. తమన్ – గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత సాహు గారపాటి మీడియాతో ముచ్చటించారు.

– ‘మజిలీ’ సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే ఎమోషన్స్ తీశాం. ఇంకాస్త పెద్ద స్కేల్ లో ఎమోషన్స్ ఉండాలని అనుకున్నాం. శివ గారు ‘టక్ జగదీష్’ కథ చెప్పారు. ఈ కథకు మంచి యాక్టర్ కావాలని అనుకున్నాం. అప్పుడు మాకు నాని గుర్తుకు వచ్చారు. మా బ్యానర్ ప్రారంభమైంది కూడా ఆయనతోనే. ఆయనకు ఈ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. ఇప్పటి వరకు ఆయన పోషించని పాత్ర ఇది. ప్రతీ ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండాలని అనుకునేలా ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్ మీదే ఉంటుంది. ఈ మధ్య ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలు తక్కువయ్యాయి. అందుకే మేం ఇలాంటి కథతో వచ్చాం. ప్రేక్షకులందరూ మంచి సినిమా చూశామని అనుకుంటారు.

– సినిమా నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు వచ్చింది. సెకండాఫ్ లో ఎమోషన్స్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. థియేటర్ కోసమే ఈ సినిమా చేశాం. ఏప్రిల్ లో విడుదల చేద్దామంటే కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. త్వరలోనే థర్డ్ వేవ్ అంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితిలో సినిమాను జనాలకు వరకు తీసుకొస్తామా? లేదా? ఇంకెప్పుడు చూపిస్తామని అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. గత డిసెంబర్ లోనే షూటింగ్ ముగిసింది. ఎప్పుడు వీలైతే అప్పుడు థియేటర్లోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాం. కానీ పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం.

– ఇది ఫ్యామిలీ ఎమోషన్ సినిమా. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. కానీ అది చాలా తక్కువ. అక్కా తమ్ముడు – అమ్మ కొడుకు ఇలా అందరి మధ్య ఎమోషన్స్ ఉంటాయి. కంటెంట్ ఎక్కడా దారి తప్పకుండా ఉండేందుకు ఎంటర్టైన్మెంట్ అంతగా జొప్పించలేదు. కానీ కథకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది.

– మా సమస్యలు మాకు ఉన్నాయి.. ఇండస్ట్రీ నుంచి కూడా మాకు సపోర్ట్ వచ్చింది. గిల్డ్ నుంచి కూడా మద్దతు లభించింది. అందుకే మేం ఎక్కువగా మాట్లాడలేదు. హీరోలైనా నిర్మాతలైనా ఎవ్వరైనా సరే.. సినిమాను జనాలకు చూపించాలనే అనుకుంటారు. ఇది జనాలకు పండుగ నాడు చూపించాల్సిన సినిమా. ప్రస్తుతం ఎక్కడా కూడా పరిస్థితులు చక్కబడలేదు. మన పక్క రాష్ట్రాల్లో కూడా ఇంకా అంతగా థియేటర్లు తెరవలేదు. విదేశాల్లోనూ పరిస్థితులు అలానే ఉన్నాయి. అందుకే ఎక్కువ మందికి ఈ సినిమాను రీచ్ అయ్యేలా చేసేందుకు ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది.

– ఇది భారీ బడ్జెట్ చిత్రం. ఈ లెక్కన అన్ని చోట్లా థియేటర్లు తెరిచి ఉండాలి. కానీ పరిస్థితులు అలా లేనందుకే ఓటీటీకి వెళ్లాం. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ రిజల్ట్ వల్ల మా అభిప్రాయం మారలేదు. ఆగస్ట్ లో మేం థియేటర్ కు రావాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు చక్కబడే అవకాశం ఉన్నట్టు మాకు కనిపించలేదు. అందుకే ఓటీటీ నిర్ణయాన్ని తీసుకున్నాం.

– బిగ్ స్క్రీన్ లో ఉన్నంత రెవెన్యూ ఓటీటీకి ఉండదు. ‘ఉప్పెన’ ‘జాతిరత్నాల’ రిజల్ట్ ఎలా ఉందో అందరం చూశాం. రిస్క్ తీసుకున్నాం. ఇన్నాళ్లూ ఎదురుచూశాం. కానీ ఇంకా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియడం లేదు. అందుకే బయటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే రెండు మూడు నెలల్లో అన్ని పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం ఆశ ఉంది. ఆ నమ్మకం ఉంటేనే బతకగలుగుతాం. మిగతా సినిమాలను కూడా రెడీ చేస్తున్నాం.

– అందరు హీరోలతో కలిసి పని చేయాలని అనుకుంటాం. చిన్న హీరోలు పెద్ద హీరోలు అని కాకుండా అందరితో చేయాలని అనుకుంటాం. అనిల్ రావిపూడి – బాలకృష్ణ ప్రాజెక్ట్ ను దసరాకు ప్రకటిస్తాం. నాగ చైతన్యతో కూడా ఓ సినిమా ఉంది. విజయ్ దేవరకొండ బిజీగా ఉండటంతో సినిమా కుదరడం లేదు.. దానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది.

– బ్యాగ్రౌండ్ స్కోర్ తమన్ చేయాల్సిందే. కానీ శివ నిర్వాణ – గోపీ సుందర్ మధ్య మంచి ర్యాపో ఉంది. ‘మజిలీ’ ‘నిన్ను కోరి’ సినిమాలకు గోపీ సుందర్ సంగీతం అందించారు. కాబట్టి గోపీ సుందర్ నుంచి ఇంకా బాగా తీసుకోగలను అనే నమ్మకంతో శివ నిర్వాణ ఉన్నారు. అందుకే అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాలు చూడడానికి వేరే కొత్త మీడియమ్స్ వచ్చాయి. థియేటర్లు కూడా ఉంటాయి. మా ప్రయార్టీ ఎప్పుడూ కూడా థియేటర్లే.


Recent Random Post: