రీ సౌండ్ : నా కట్టె కాలేంతవరకూ…?

నా కట్టె కాలేంతవరకూ..నాలో ప్రాణం ఉన్నంతవరకూ… తెలుగు జాతి బతికి ఉన్నంతవరకూ…తెలుగుదేశం పార్టీ బతికి ఉన్నంతవరకూ…తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను…పార్టీకి ఎపుడు నా అవసరం ఉన్నా…ఏ రూపంలో కావాల్సివచ్చినా కూడా…నేను ఆ బాధ్యతను నా పార్టీ వైపు…మా పార్టీ వైపు మనందరి పార్టీ వైపు నడచి తప్పకుండా నేను తీరుస్తాను అని…ఇదీ ఒకనాడు జూనియర్ ఎన్టీయార్ ఒకానొక సందర్భంలో చెప్పిన భావోద్వేగం తో కూడిన భారీ డైలాగ్.

ఇపుడు అది సోషల్ మీడియా అంతా ఒక్క లెక్కన వైరల్ అవుతోంది. అవును ఈ రోజు ఎన్టీయార్ పుట్టిన రోజు. ఆయన సినీ జీవితానికి సంబంధించిన విశేషాలను అభిమానులు ఒక వైపు గొప్పగా పంచుకుంటూంటే టీడీపీ తమ్ముళ్ళు మాత్రం ఎన్టీయార్ గొంతుతో చెప్పిన ఈ డైలాగ్ ని సోషల్ మీడియాలో పెట్టి మరీ వైరల్ చేస్తున్నారు.

ఒక విధంగా తెలుగుదేశం పార్టీ జూనియర్ ని రా ఇటు వైపు కదలిరా అని నోరారా పిలుస్తోంది. ఆయన పుట్టిన రోజు వేడుకలను టీడీపీ తమ్ముళ్ళు చాలా మంది ఏపీలో ఘనంగా జరుపుకున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి అనంతపురం జిల్లా టూర్లో ఉన్న చంద్రబాబుకు తమ్ముళ్ళు స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా సభా వేదిక వద్దనే జూనియర్ ఎన్టీయార్ జన్మ దిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు.

అంతే కాదు అక్కడ జూనియర్ ఎన్టీయార్ కటౌట్లు ఏర్పాటు చేశారు. దానికి ఫ్యాన్స్ తో పాటు టీడీపీ తమ్ముళ్లు పాలాభిషేకం చేశారు. ఎన్టీయార్ సీఎం అంటూ తమ్ముళ్ళు నినాదాలు చేశారు. బాదుదే బాదుడు కార్యక్రమం వేదిక అది టీడీపీ అధినేత చంద్రబాబు టూర్ అది అయినా జూనియర్ అభిమానులు మాత్రం కాబోయే సీఎం ఎన్టీయార్ అని గట్టిగానే సౌండ్ చేస్తున్నారు.

ఇది కుప్పంతో మొదలైంది. క్రిష్ణా జిల్లాలో బాబు టూర్ లో మరింతగా పాకింది ఇపుడు కధ అనంతపురం దాకా వచ్చింది. మొత్తానికి టీడీపీని ఆ మూడు అక్షరాలు మాత్రం తారకమంత్రంగా అల్లుకుని అలా సాగిపోతున్నాయి. నాడు పెద్దాయన ఎన్టీయార్ టీడీపీలో అంతా తానై వెలిగితే రేపటి తరానికి జూనియర్ ఎన్టీయార్ కావాలన్నది నినాదంగా మారుతోంది.

మొత్తానికి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఒక వైపు ప్రజలకు చేరువ కావాలని చూస్తూంటే బాబు చెవికి గట్టిగా వినిపించేలా కాబోయే సీఎం ఎన్టీయార్ అన్న స్లోగన్స్ మారు మోగుతున్నాయి. మరి తమ్ముళ్ళకు అందరూ ఒక్కటే అంతా అన్న గారి కుటుంబమే. అయితే నారా ప్లస్ నందమూరి కలవాలని రేపటి రోజున ఏపీలో పార్టీ జెండా ఘనంగా ఎగరాలన్న నిస్వార్ధమైన విన్నపం వారిది. మరి అది తీరేనా. కాలమే జవాబు చెప్పాలి.


Recent Random Post: