జక్కన్న ఎక్కడుండేది ఎన్నారైలకు తెలియకుండా చూసుకుంటున్నారా..?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ”ఆర్.ఆర్. ఆర్” మూవీకి అంతర్జాతీయ ప్రశంసలు దక్కతున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ రిలీజ్ లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది.

RRR నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో భారతదేశం నుండి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాని దిగ్గజ ఓటీటీలో వీక్షించిన పలువురు హాలీవుడ్ ప్రముఖులు.. ఈ మాగ్నమ్ ఓపస్ ను తెరపై ఆవిష్కరించిన దర్శకుడు రాజమౌళి పనితనాన్ని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ట్రిపుల్ ఆర్ చిత్రానికి పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన రెస్పాన్స్ చూసి రాజమౌళి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఆదరణను ఊహించలేదని.. చాలా సంతోషంగా ఉందని దర్శకుడు ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం యూఎస్ కు వెళ్లిన జక్కన్న.. RRR భారీ విజయంపై ఆశ్చర్యం మరియు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే రాజమౌళి యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నప్పటికీ.. అతను ఉండే ఖచ్చితమైన లొకేషన్ ను వెల్లడించకుండా టీమ్ జాగ్రత్త పడుతోంది. సాధారణంగా ఇలాంటి ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ కు మన ఫిలిం మేకర్స్ వెళ్ళినప్పుడు.. లొకేషన్ గురించి చాలా ముందుగానే ప్రచారం చేస్తుంటారు. తద్వారా స్థానిక ప్రేక్షకుల నుండి దృష్టిని ఆకర్షించవచ్చని భావిస్తుంటారు.

కానీ రాజమౌళి విషయంలో మాత్రం అలా జరగడం లేదు. జక్కన్న ఆచూకీ తెలిస్తే భారతీయ ప్రవాసులు అతన్ని చూసేందుకు వేలాదిగా తరలివస్తారని ఆలోచించి.. కచ్చితమైన ప్రదేశాన్ని బహిర్గతం చేయడం లేదు. రాజమౌళి క్రేజ్ అలాంటిది కాబట్టి.. భద్రతా సమస్యలు రాకుండా వీలయినంత వరకూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే RRR టీమ్ సోషల్ మీడియాలో దీని గురించి ట్వీట్ కూడా పెట్టలేదని తెలుస్తోంది.

ఇకపోతే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి గ్లోబల్ ప్రశంసలు దక్కిన తర్వాత ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ అయ్యే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. వెరైటీ మ్యాగజైన్ ఇప్పటికే వివిధ కేటగిరీలలో ప్రాబబుల్ ఆస్కార్ నామినీల జాబితాను ప్రచురించింది. అందులో RRR కు కూడా చోటు కల్పించింది.

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ క్యాటగిరీలో నామినేట్ చేయబడవచ్చని వెరైటీ అంచనా వేసింది. తాజా ఎడిషన్ లో ఉత్తమ నటుడి విభాగంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నామినేషన్స్ లో ఉంటారని అంచనా వేసింది. అలానే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘దోస్తీ’ పాటకు నామినేట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

టొరెంటో ఫిల్మ్ ఫెస్ట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. “బాహుబలి’ జపాన్ లో మంచి ఆదరణ వచ్చింది. నేను ఎంచుకునే కథలు తెలుగు దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్తాయని నాకు నమ్మకం ఉండేది. కానీ దేశం దాటి వెళ్తాయని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ‘బాహుబలి’ కి జపాన్లో వచ్చిన ఆదరణ చూసిన తర్వాతే నాకు నమ్మకం కలిగింది. వెస్ట్రన్ దేశాల ప్రజలకు మన సినిమాలు నచ్చుతాయని అర్థమైంది అని అన్నారు

”RRR చిత్రాన్ని పశ్చిమ దేశాల్లోని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేయలేదు. ఆ ఆలోచన కూడా లేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత నెమ్మదిగా అక్కడి ప్రేక్షకులుకు కూడా నచ్చిందన్న అభిప్రాయాలు రావడం మొదలైంది. ఏదో కొద్దిమందికి నచ్చిందేమో అనుకున్నా. నెమ్మదిగా వారి సంఖ్య పదుల నుంచి వందలు.. వందల నుంచి వేల వరకూ పెరిగింది. హాలీవుడ్ రచయితలు దర్శకులు విమర్శకులు.. వివిధ రంగాలకు చెందిన ప్రజలు ‘ఆర్ఆర్ఆర్’ గురించి గొప్పగా మాట్లాడటం చూసి.. ఇవన్నీ నా గురించి.. నా సినిమాల గురించేనా? అని అనిపించింది” అని రాజమౌళి చెప్పారు.

“హాలీవుడ్ ప్రేక్షకులకు నా సినిమాలు నచ్చుతున్నాయి కదా అని నా ఆలోచన ధోరణి మార్చుకుని సినిమాలు తీస్తే అది సరిగా వర్కవుట్ కాకపోవచ్చు. కథను చెప్పే విధానంలో నాకంటూ ప్రత్యేకమైన శైలి ఉంది. దాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. అంతేకానీ పూర్తిగా నా శైలి నుంచి మార్చుకుని సినిమాలు తీయకూడదు. అలా చేస్తే రెండు పడవలపై ప్రయాణం చేసినట్లే”

”నేను కథను చెప్పే విధానానికి కట్టుబడి ఉంటూనే.. దాన్ని మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా తీర్చిదిద్దాలి. ఇలా ఎన్ని రకాల మార్పులు చేసినా.. అదనపు హంగులు జోడించినా.. అంతిమంగా అది కచ్చితంగా నా స్టోరీ అయ్యుండాలి. ‘ఇది రాజమౌళి స్టోరీ కాదే’ అనిపించకూడదు. కథ చెప్పే విషయంలో మీరు నన్ను మార్గనిర్దేశుడు అంటున్నారు. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడిప్పుడే అడుగులు వేయటం మొదలు పెట్టాను. అలాగే ముందుకు వెళ్తే మరింత విజయవంతమైతే.. అప్పుడు మీరు అన్నది కరెక్ట్ అవుతుందేమో చూద్దాం” అని రాజమౌళి చెప్పుకొచ్చారు.


Recent Random Post: