అదాశర్మ ప్రతిభను మిస్ యూజ్ చేసిన సౌత్ డైరెక్టర్స్

గ్లామరస్ డాళ్ పాత్రల్లో మెప్పించడం కథానాయికలకు పరమ రొటీన్. కానీ నటనకు ఆస్కారం ఉన్న కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో తమదైన నటనతో మైమరిపింపజేస్తేనే ఏ నటికి అయినా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. కానీ కథానాయికల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాసే దర్శకరచయితలు చాలా తక్కువ. అలాగే ప్రతి సినిమా కాన్సెప్ట్ బేస్డ్ కావాలని ఆశించినా కుదిరే పని కాదు. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ తర్వాత ఫలితం అనన్య సామాన్యం.

దాదాపు దశాబ్ధం పాటు తెలుగు-హిందీ-తమిళ చిత్రసీమల్లో నటించిన అదా శర్మకు నిజానికి టాలీవుడ్ లో ఆశించిన అవకాశాలు రాలేదనే చెప్పాలి. బాలీవుడ్ హారర్ చిత్రం 1920తో నటిగా మెప్పించిన అదాశర్మ అందచందాలకు ఫిదా అయిన మాస్ కమర్షియల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యూత్ స్టార్ నితిన్- హార్ట్ ఎటాక్ లో అవకాశం ఇచ్చారు. తొలి సినిమాతోనే తనదైన క్యూట్ లుక్స్ అందమైన ఎక్స్ ప్రెషన్స్ తో అదా యువతరం హృదయాల్ని దోచుకుంది. కానీ ఆ తర్వాత అగ్ర హీరోల సరసన ఆశించినన్ని అవకాశాలైతే రాలేదు. బన్ని సరసన సన్నాఫ్ సత్యమూర్తిలో మూడో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. సమంత ఇందులో షో స్టాపర్ గా నిలిచింది. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించినా కానీ ఏవీ అంతగా గుర్తింపునివ్వలేదు. చాలా మంది తెలుగు దర్శకులు తన ప్రతిభకు తగ్గ పాత్రల్ని ఇవ్వలేదని అదాశర్మ పలు ఇంటర్వ్యూల్లో పబ్లిగ్గా వాపోయిన సందర్భాలున్నాయి. తాజాగా అది ప్రూవ్ అయింది.

ఎట్టకేలకు చాలా కాలం తర్వాత అదాశర్మకు `ది కేరళ స్టోరి`తో బిగ్ బ్రేక్ వచ్చింది. ఈ సినిమా తెలుగు-తమిళం-హిందీ సహా అన్ని భాషల్లో అత్యుత్తమ బాక్సాఫీస్ వసూళ్లతో ఆకట్టుకుంది. ముఖ్యంగా అదాశర్మ ప్రధాన పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది. ది కేరళ స్టోరిలో జిహాదీ-ఐసిస్ ఉగ్రమూకల లవ్ ట్రాప్ లో పడే యువతిగా గర్భిణిగా.. ఆకట్టుకునే నటనతో అదా మనసులు దోచింది. 30రోజుల్లో 235కోట్ల వసూళ్లతో కేరళ స్టోరి సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో అదా ఎంతో పరిణతి ఉన్న నటిగా మెప్పించింది. ముఖ్యంగా గర్భిణిగా ఎమోషనల్ పాత్రలో ఎంతో అద్భుతంగా అభినయించింది. మరోవైపు కేరళలోని ఒక హిందూ సాంప్రదాయ కుటుంబానికి చెందిన అల్లరి అమ్మాయిగా అదా నటన మైమరిపించింది.

తారలకు సరైన పాత్ర పడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది. అదాశర్మకు ఇలాంటి మరిన్ని అవకాశాలు దక్కేందుకు ఇప్పుడు దారులు తెరుచుకున్నాయని చెప్పాలి. ఇదే సందర్భంలో తెలుగు దర్శకులు అదాశర్మ ప్రతిభకు తగ్గ అవకాశాలివ్వలేదా? అన్న సందేహాల్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ది కేరళ స్టోరితో అదాలో దాగున్న అసలు సిసలు ప్రతిభ బయటపడింది. తన ప్రతిభను సద్వినియోగం చేసుకునే మరిన్ని పాత్రల్ని దర్శకనిర్మాతలు సృష్టిస్తారేమో చూడాలి.


Recent Random Post: