మంచు బ్రదర్స్ మధ్య మనస్పర్థలు నిజమేనా?

మంచు బ్రదర్స్ మధ్య విభేదాలున్నానే మాట ఈనాటిది కాదు. మంచు విష్ణు, మనోజ్ కుమార్ ల మధ్య గొడవలు ఉన్నాయంటూ గత ఏడాదిన్నర కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. దీనిపై అన్నదమ్ములిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు.. ఖండించలేదు. అయితే తాజాగా మనోజ్, విష్ణుల మధ్య మనస్పర్థలు ఉన్నాయనే ప్రచారం మరోసారి తెర మీదకు వచ్చింది. నిన్న జరిగిన దేవసేన శోభా ఎంఎం బారసాల కార్యక్రమంలో మంచు విష్ణు కనిపించకపోవడమే దీనికి కారణమైంది.

మంచు మనోజ్‌-మౌనిక దంపతులకు ఏప్రిల్‌ లో పండంటి ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. ఈ పాపను ముద్దుగా ‘ఎంఎం పులి’ అని పిలుచుకుంటున్నట్లు గతంలో మంచు లక్ష్మి చెప్పారు. తాజాగా మనోజ్ తన కుమార్తెకు ‘దేవసేన శోభా ఎంఎం’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. నామకరణ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఎక్స్‌ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో మంచు మోహన్ బాబు దంపతులు, భూమా కుటుంబ సభ్యులు ఉన్నారు. కానీ మంచు విష్ణు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలానే కుమార్తె పేరుని ప్రకటిస్తూ మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుదీర్ఘమైన నోట్ లోనూ ఆయన సోదరుడి పేరుని ప్రస్తావించలేదు.

శివుడి దయతో, అందరి ప్రేమతో పాపకు దేవసేన శోభా అనే పేరు పెట్టినట్లు చెప్పారు మంచు మనోజ్‌. శివ భక్తుడిగా సుబ్రహ్మణ్యస్వామి భార్య పేరు వచ్చేలా ‘దేవసేన’ అని పెట్టామని, అత్తగారు శోభా నాగిరెడ్డి పేరు కలిసొచ్చేలా ‘శోభా’ అని యాడ్ చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మోహన్ బాబు, నిర్మలా దేవి.. సోదరి మంచు లక్ష్మికి మనోజ్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భార్య మౌనిక తోబుట్టువులు భూమా అఖిల, విఖ్యాత్ లతో పాటుగా భూమా ఫ్యామిలీ మొత్తానికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. కానీ మనోజ్ తన సోదరుడు విష్ణు ఫ్యామిలీని ప్రస్తావించలేదు. ఇదే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య వివాదాలు ఉన్నాయని నెట్టింట ప్రచారం జరగడానికి కారణమైంది.

నిజానికి గతేడాది మార్చిలోనే మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు బయటకు వచ్చాయి. ఇద్దరూ కొన్నాళ్లుగా ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్నారని గుసగుసలూ వినిపించాయి. మనోజ్ పెళ్ళిలో విష్ణు దూరం దూరంగా ఉండటం వీటికి బలం చేకూర్చినట్లైంది. అదే సమయంలోనే తన సన్నిహితుల ఇంటికెళ్లి మంచు విష్ణు గొడవ చేసినట్లుగా చెబుతూ మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. కొద్దిసేపటికే ఆ వీడియోని డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే అది వైరల్ అయిపోయింది. దీంతో ఇరువురి మధ్య విబేధాలు ఉన్నాయనే పుకార్లు నిజమే అని అందరూ అనుకున్నారు.

ఇది జరిగిన కొన్ని రోజులకు మంచు విష్ణు ‘హౌస్ ఆఫ్ మంచూస్’ అనే పేరుతో ఓ రియాలిటీ షో చేస్తున్నట్లు తెలుపుతూ ఓ వీడియోని విడుదల చేశారు. మంచు బ్రదర్స్ ఫైట్ అంటూ టీవీ ఛానల్స్ లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ క్లిప్పింగ్స్, మంచు ఫ్యామిలీ విజువల్స్ ను చూపించారు. త్వరలోనే ఈ షో ప్రసారం కానుందని పేర్కొన్నారు. దీంతో విష్ణు – మనోజ్ ల మధ్య జరిగిందంతా ఫ్రాంక్ వీడియో అయ్యుంటుందని కొందరు భావించారు. అయితే మరికొందరు మాత్రం ఆ వీడియోలో మనోజ్ లేకపోవడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందనే అభిప్రాయానికి వచ్చారు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ కలిసి కనిపించలేదు. మోహన్ బాబు యూనివర్సిటీ వేడుకల్లోనూ కలిసి వేదికను పంచుకోలేదు. కానీ ఇప్పుడు మనోజ్ కూతురు బారసాలలో విష్ణు కనిపించకపోవడం.. ఇంకా మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు అలానే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.


Recent Random Post: