ట్రోలింగ్: స్టార్ హీరో ఎప్పుడూ తాగి కనిపిస్తాడా?


సోషల్ మీడియాల్లో ట్రోలింగ్ భారిన పడని తారలు లేరు. ఇప్పుడు ఈ సెగ రణబీర్ కపూర్ ని కూడా తాకింది. అతడు నటించిన శంషేరా ఇటీవల విడుదలై డిజాస్టరైన సంగతి తెలిసిందే. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేయగా కేవలం 60 కోట్లు లైఫ్ టైమ్ లో వసూలు చేస్తోందని ట్రేడ్ విశ్లేషించింది.

ఈ పరాజయం రణబీర్ ని తీవ్రంగా నిరాశపరిచిందని తాజా ఇన్సిడెంట్స్ చెబుతున్నాయి. ఇటీవల శంషేరాలో చివరిగా కనిపించిన రణబీర్ కపూర్ తాజాగా ముంబై నగరంలో షికార్ చేస్తూ కనిపించాడు. అతడు నగరంలో బూడిదరంగు టీ-షర్ట్ బ్లాక్ ప్యాంటు ధరించి కనిపించాడు. అయితే స్టార్ హీరో వాలకం చూశాక కొందరు నెటిజనులు ఎప్పుడూ తాగి అలసిపోయినట్లు కనిపిస్తున్నావు! అంటూ ట్రోల్ చేశారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. “అతను (రణబీర్) ఎప్పుడూ తాగి కనిపిస్తాడా??“ అని వ్యాఖ్యానించాడు. మరొక ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఇలా రాశాడు. “కూల్ బట్ అలసిపోయాడు..“ అని.. “అతను వృద్ధుడిలా కనిపిస్తున్నాడ“ని కొందరు ట్రోల్ చేసారు.

రణబీర్ కపూర్ తన లుక్స్ విషయంలో అజాగ్రత్తగా ఉండడంతో వయోభారం విషయంలో ట్రోల్ చేయడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రితం అతను తన భార్య అలియాను రిసీవ్ చేసుకోవడానికి విమానాశ్రయానికి వెళ్లి అప్పుడు కూడా ట్రోలింగుకి గురయ్యాడు. అతడి లుక్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ట్రోలర్లు నిజానికి నిత్య జీవితంలో తారల లుక్స్ చూసి వారిని అంచనా వేయడం మానేయాలి. సాధారణ వ్యక్తిలాగే వారు కూడా రాత్రింబగళ్లు పని చేస్తూ అలసిపోతుంటారని గ్రహించాలి.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అలియా భట్ ట్రోలింగ్ కల్చర్ పై ఓపెనైన సంగతి తెలిసిందే. “ముజే అబ్ ట్రోలింగ్ సే ఇత్నా ఫర్క్ నహీ పడ్తా హై. కిత్నే లాగ్ ట్రోల్ కర్తే హై? ముఝే లగ్తా హై కి హమ్ హీ ఉన్హే జ్యాదా భావ్ దే దేతే హై“ అని ఆలియా వ్యాఖ్యానించింది. రణబీర్ సోషల్ మీడియాల్లో పెద్దగా ఇలాంటి వాటిపై స్పందించరు. కానీ అతడు తన భార్య మంత్రాన్ని ఫాలో అయిపోతే బావుంటుందేమో అని కొందరు సూచిస్తున్నారు.

రణబీర్ నటించిన శంషేరా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. తదుపరి బ్రహ్మాస్త్ర పైనే అతడి ఆశలన్నీ. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహకాల్లో ఉన్నారు. బ్రహ్మాస్త్ర 9 సెప్టెంబర్ 2022న విడుదల కానుంది. సందీప్ వంగాతో రణబీర్ తదుపరి చిత్రం `యానిమల్` వచ్చే ఏడాది పెద్ద స్క్రీన్ లపైకి రానుంది.

అలియా భట్ నటించిన డార్లింగ్స్ 5 ఆగస్ట్ 2022న నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది. ప్రస్తుతం డార్లింగ్స్ ప్రమోషన్ లలో ఆలయా బిజీగా ఉంది. డార్లింగ్స్ కాకుండా `హార్ట్ ఆఫ్ స్టోన్` .. `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ`లో కనిపించనుంది. ఈ రెండు సినిమాల షూటింగ్ లను పూర్తి చేసింది. త్వరలో తన భర్త రణబీర్ తో కలిసి బ్రహ్మాస్త్ర ప్రమోషన్ లను ప్రారంభించనుంది.


Recent Random Post: