ఆ దర్శకుడికి మళ్ళీ అక్కినేని హీరోనే..

కింగ్ నాగార్జున ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. సోలోగా ఓ వైపు చేస్తూనే మరో వైపు పాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ ని పెంచుకోవడానికి ఇతర స్టార్ హీరోల చిత్రాలలో నాగ్ నటిస్తున్నారు. ఈ కారణంగా దర్శకులు కూడా కింగ్ నాగార్జునని దృష్టిలో పెట్టుకొని మంచి క్యారెక్టర్స్ రాసుకుంటున్నారు. నాగార్జునకి నేరేట్ చేసి తమ సినిమాలలో కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.

శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ తో చేస్తోన్న కుభేర సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ హీరోగా కూలి మూవీ పాన్ ఇండియా లెవల్ లో చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నాగార్జునని కన్ఫర్మ్ చేసారంట. ఇప్పటికే హిందీలో బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున నటించారు. ఇలా భాషాబేధం లేకుండా మంచి పాత్రలు ఉంటే నిడివి తక్కువ ఉన్న నటించడానికి నాగ్ ఒకే చెబుతున్నారు.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా నాగార్జున నుంచి నా సామిరంగా ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది కూడా ఓ రకంగా మల్టీ స్టారర్ చిత్రంగానే తెరకెక్కింది. నాగార్జునతో పాటు యంగ్ హీరోలైన అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నా సామి రంగ మలయాళీ హిట్ మూవీ రీమేక్ గా వచ్చింది.

అయితే విజయ్ బిన్నీకి దర్శకుడిగా అనుభవం లేకపోయిన చాలా తక్కువ సమయంలో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి కింగ్ నాగార్జునని మెప్పించాడు. అలాగే తన టేకింగ్ తో సక్సెస్ కూడా ఇచ్చాడు. ఈ కారణంగా నాగార్జున విజయ్ బిన్నీకి మరో అవకాశం ఇచ్చాడంట. కథ సిద్ధం చేసుకోమని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే విజయ్ బిన్నీ కూడా ఇతర హీరోలతో సంప్రదింపులు జరిపినప్పటికి ఎవరితోనూ వర్కౌట్ కావడం లేదట. ఇక మరోసారి అతను నాగ్ తోనే కొనసాగే ఆవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో బంగార్రాజు సీక్వెల్ ని కూడా నాగార్జున ఈ ఏడాది సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పుడు తెరపైకి విజయ్ బిన్నీ పేరు కూడా వచ్చింది. అయితే ఈ సారి విజయ్ బిన్నీ సొంత కథతో నాగార్జునని మెప్పిస్తాడా లేదంటే మళ్ళీ రీమేక్ మీద ఆధారపడతాడా అనేది తెలియాల్సి ఉంది. అలాగే మరో రెండు కథల విషయంలో కూడా నాగ్ త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.


Recent Random Post: